భార‌త్ భ‌ద్ర‌తకు అతిపెద్ద ముప్పుగా చైనా

భార‌త్ భ‌ద్ర‌తకు చైనా అతిపెద్ద ముప్పుగా మారింద‌ని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ జ‌న‌ర‌ల్ బిపిన్ రావ‌త్ తెలిపారు. దేశ స‌రిహ‌ద్దుల్లోకి ర‌క్ష‌ణ నిమిత్తం పంపిన వేలాది మంది సైనికులు, ఆయుధాలు ఇప్ప‌ట్లో తిరిగి బేస్ క్యాంపున‌కు తిరిగిరాలేవ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. 

చైనాతో స‌రిహ‌ద్దు స‌మ‌స్య ప‌రిష్కారం ఇప్ప‌ట్లో జ‌ర‌గ‌ద‌ని, ఆ స‌మ‌స్య ప‌రిష్కారంలో అప‌న‌మ్మ‌కం, అనుమానాలు పెరుగుతున్నాయ‌ని ఆయ‌న తెలిపారు. రెండు దేశాల సైనికుల మ‌ధ్య ఇటీవ‌ల జ‌రిగిన 13వ ద‌ఫా చ‌ర్ఛ‌లు విఫ‌లం అయిన విష‌యం తెలిసిందే. ఆ చ‌ర్చ‌ల్లో ప్ర‌తిష్టంభ‌న నెల‌కొన్న‌ది.

సరిహద్దు నుంచి ఎలా ద‌ళాల‌ను వెన‌క్కి ర‌ప్పించాల‌న్న అంశంపై రెండు దేశాలు స‌మాలోచ‌న‌ల్లో ప‌డ్డాయి. గ‌ల్వాన్ ఘ‌ర్ష‌ణ త‌ర్వాత స‌రిహ‌ద్దు వెంట రెండు దేశాలు మౌళిక‌స‌దుపాయాలు పెంచుకుంటున్నాయి. ద‌ళాలు, సైనిక ఆయుధాలు అక్క‌డ‌కు చేరుకుంటున్నాయి. అయితే స‌రిహ‌ద్దుల్లో జ‌రిగే ప‌రిణామాల‌ను ఎదుర్కొనేందుకు భార‌త్ సిద్ధంగా ఉంద‌ని బిపిన్ తెలిపారు. ఎల్ఏసీ వెంట చైనా గ్రామాల‌ను నిర్మిస్తోంద‌ని, వివాదాస్ప‌ద బౌండ‌రీ వ‌ద్ద ఆ నిర్మాణాలు జ‌రుగుతున్న‌ట్లు రావ‌త్ తెలిపారు.

500% పెరిగిన సైబర్ నేరాలు

కాగా, కరోనా అనంతరం దేశంలో సైబర్ నేరాల రేటు 500 శాతం పెరిగిందని బిపిన్ రావత్ తెలిపారు. 14వ హ్యాకింగ్,  సైబర్ సెక్యూరిటీ అనే అంశంపై ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు.  డ్రోన్లు, రాన్సంవేర్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ డివైజ్‌లు వంటి వాటితో రాష్ట్రాలు, దేశంపై అనేక బెదిరింపులు రావచ్చని హెచ్చరించారు. వాటి నియంత్రణలో అందరం కలిసి పని చేయాలని రావత్ పిలుపునిచ్చారు.