బెయిల్ పై ఉన్న వ్యక్తి ఏపీ ప్రభుత్వ సలహాదారుడా!

ఉద్యోగుల భూములను అమ్ముకొని, ఏపీ ప్రభుత్వమే క్రిమినల్ కేసు దాఖలు చేయగా హైకోర్టు నుండి బెయిల్ పొంది బయటనున్న  ఏపీ ఎన్‌జీవో అసోసియేషన్‌ మాజీ అధ్యక్షులు  ఎన్‌. చంద్రశేఖరరెడ్డిని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సలహాదారునిగా నీయమిస్తారా అంటూ ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం(ఏపీజీఈఏ) రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్‌ సూర్యనారాయణ ధ్వజమెత్తారు.

విజయవాడలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని దుయ్యబడుతూ ఉమ్మడి ఎపి లో హైదరాబాద్ లో 182 ఎకరాలలో ఉద్యోగుల భూములను అమ్ముకున్నాడని పేర్కొంటూ, విజిలెన్స్ విచారణ చేసి క్రిమినల్ చర్యలు తీసుకోవాలని  సూచించడంతో ఎపి ప్రభుత్వం అధికారికంగా చంద్రశేఖర్ రెడ్డి ఫై క్రిమినల్ కేసు బుక్ చేసిందని ఆయన తెలిపారు. 

హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇస్తే బయట తిరుగుతున్నారని చెబుతూ కేసు పెట్టిన ప్రభుత్వమే .. ఉద్యోగుల సలహాదారునిగా ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. సిఎం జగన్మోహన్ రెడ్డి కి ఈ అంశాలు చెప్పకుండా పదవి ఇచ్చారనే అనుమానం కలుగుతుందని ఆయన చెప్పారు. కాగా,  ఉద్యోగుల పట్ల ప్రభుత్వం గౌరవంతో వ్యవహరించడం లేదని చెబుతూ ఆర్ధిక పరమైన అంశాలతో సంబంధం లేనివాటిని కూడా పరిష్కరించడం లేదని విచారం వ్యక్తం చేశారు.

 ‘‘గత ఎన్నికల్లో ఉద్యోగులంతా కోరి మరీ జగన్‌ను ముఖ్యమంత్రిగా గెలిపించారు. అయినప్పటికీ మా సమస్యలను ఆయన ఏమాత్రం పట్టించుకోవటం లేదు’’ అంటూ ముఖ్యమంత్రి వైఖరిపట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సిపియస్ రద్దు, డి.ఎ ల చెల్లింపు, పి.ఆర్సీ అమలుతో సహా రెండున్నరేళ్ల పరిపాలన పరిశీలిస్తే… ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని సూర్యనారాయణ విమర్శించారు. ఇంతవరకు వేతన సవరణ సంఘం ఇచ్చిన నివేదికను సహితం తమకు ఇవ్వలేదని చెప్పారు.

ఇటీవల ముఖ్యమంత్రిని కలిసి ఉద్యోగుల సమస్యలపై స్పందించాలని కోరామని, దాదాపు వంద  సమస్యలను వివరించగా.. 80 అంశాల్లో అందరూ ఏకాభిప్రాయంతో ఉన్నారని తెలిపారు. తీరా చూస్తే ఆర్థిక పరమైన అంశాలతో సంబంధం లేని వాటి పట్ల కూడా ప్రభుత్వం స్పందించడం లేదని దుయ్యబట్టారు. జి.పి.ఎఫ్., పదవీ విరమణ బెని ఫిట్స్ పెండింగ్‌లో పెడుతున్నారని,  దీనిపై వారం రోజుల్లో షెడ్యూల్ రిలీజ్ చేస్తామని చెప్పి మరచిపోయారని ధ్వజమెత్తారు. ఆర్ధిక శాఖ అధికారులు మాటలు చెప్పడం తప్ప… డబ్బు మాత్రం ఇవ్వడం లేదని దుయ్యబట్టారు. 

ఉద్యోగులకు ఒకటో తేదీన ఇవ్వలేక పోయినా .. ఎప్పుడో ఒకప్పుడు ఇస్తూన్నాం కదా అని ఆర్ధిక మంత్రి  బుగ్గన చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఉద్యోగుల ను కించ పరిచేలా బుగ్గన మాట్లాడం మానుకోవాలని హితవు చెప్పారు. ఉద్యోగ సంఘాలను బలహీనం చేసే విధంగా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి అనుబంధ సంస్థగా తాము కొనసాగలేమని తేల్చి చెప్పారు.

ఉద్యోగుల జీపీఎఫ్‌ నిధులు కూడా పక్కదారి పడుతున్నాయని సూర్యనారాయణ ఆరోపించారు. ఉద్యోగుల జీతం నుంచి దాచుకున్న సొమ్ము జీపీఎఫ్‌ ఖాతాల్లో ఉంటుందని, ఈ సొమ్మును అవసరానికి విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉద్యోగులకు ఉందని తెలిపారు. ఇది సాలీనా రూ.8-10 కోట్ల సొమ్ము ఉంటుందని, దీనిని ఎక్కడైనా మదుపు చేసుకునే హక్కును రాజ్యాంగం కల్పించిందని, ఆఖరికి ఈ హక్కును కూడా ప్రభుత్వం హరించి, జీపీఎ్‌ఫను ఆదాయంగా మలుచుకుంటోందని ఆరోపించారు. ఏడాదిన్నరగా ప్రభుత్వం జీపీఎఫ్‌ డబ్బులు చెల్లించడం లేదని ఆరోపించారు.