ట్విట్టర్ సీఈఓకు బ్రిటిష్ ప్రిన్స్ హెచ్చరిక 

 అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడిన సమయంలో ట్విటర్‌ను రాజకీయ అశాంతిని పురిగొలిపేందుకు దుర్వినియోగపరుస్తున్నారని తాను ట్విటర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) జాక్ డోర్సీని హెచ్చరించానని బ్రిటన్ ప్రిన్స్ హ్యారీ చెప్పారు. ఈ ఏడాది జనవరి 6న కేపిటల్ కాంప్లెక్స్‌పై డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు దాడి చేయడానికి ముందే తాను ఈ హెచ్చరిక చేశానని తెలిపారు. 
 
కాలిఫోర్నియాలో ‘తప్పుడు సమాచార వ్యాప్తి’పై తిరిగిన ఆన్‌లైన్ ప్యానెల్ చర్చలో ప్రిన్స్ పాల్గొంటూ కేపిటల్ కాంప్లెక్స్‌పై దాడి జరగడానికి ముందు రోజు తాను తన ఆందోళనను ఈ-మెయిల్ ద్వారా జాక్ డోర్సీకి తెలియజేశానని చెప్పారు. జనవరి 6కు ముందు జాక్, తాను పరస్పరం ఈ-మెయిల్ ద్వారా సంభాషించుకున్నట్లు తెలిపారు.
తిరుగుబాటుకు ట్విటర్ వేదికను అనుమతిస్తున్నారని తాను ఆయనను హెచ్చరించానని తెలిపారు. తాను హెచ్చరించిన మర్నాడే కేపిటల్ కాంప్లెక్స్‌పై దాడి జరిగిందని, ఆ తర్వాత జాక్ డోర్సీ తనతో మాట్లాడలేదని పేర్కొన్నారు.

ప్రిన్స్ హ్యారీ ఫేస్‌బుక్ తదితర సామాజిక మాధ్యమాలపై కూడా మండిపడ్డారు. ఈ వేదికలు కోవిడ్, వాతావరణ మార్పులపై తప్పుడు సమాచారాన్ని వ్యాపింపజేసి కోట్లాది మందిని తప్పుదోవ పట్టిస్తున్నాయన్నారు. యూట్యూబ్ నిబంధనలను ఉల్లంఘించే తప్పుడు సమాచారంతో కూడిన అనేక కోవిడ్ సంబంధిత వీడియోలు ఇప్పటికీ ఆ మాధ్యమంలో ఉన్నాయని పేర్కొన్నారు. 

యూజర్ వాస్తవంగా అన్వేషించినదానికి భిన్నంగా యూట్యూబ్ సొంత ఆల్గోరిథంలో ఉన్న రికమెండేషన్ టూల్ ద్వారా ఈ వీడియోలు వస్తుండటం మరింత దయనీయమని తెలిపారు. యూట్యూబ్ దీనిని ఆపగలిగినప్పటికీ, ఆపడం లేదని, అందుకు కారణం దాని ఆదాయంపై ప్రభావం పడుతుందనే ఆలోచనేనని స్పష్టం చేశారు. 

ప్రిన్స్ హ్యారీ అమెరికన్ నటి మేఘన్‌ను వివాహం చేసుకున్నారు. తాము రాయల్ డ్యూటీస్‌ను వదిలిపెట్టి, ఉత్తర అమెరికాకు వెళ్ళిపోతున్నట్లు గత ఏడాది వీరిద్దరూ ప్రకటించారు.