ఉగ్రవాద చర్యలకు ఆఫ్ఘన్ భూభాగం ఉపయోగించరాదు

ఉగ్రవాదులకు ఆశ్రమ ఇవ్వడానికి, శిక్షణ ఇవ్వడానికి, ఆర్ధిక వనరులు సమకూర్చడానికి లేదా మరే ఇతరమైన ఉగ్రవాద కార్యక్రమాలకు ఆఫ్ఘానిస్తాన్ భూభాగాన్ని ఉపయోగించేందుకు అనుమతిప కూడదని ఆఫ్ఘన్ వ్యవహారాలపై ఢిల్లీలో జరిగిన ఎనిమిది  దేశాల జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం జారీచేసిన సంయుక్త ప్రకటన స్పష్టం చేసింది. 
 
ఆఫ్ఘానిస్తాన్ శాంతియుతంగా, సురక్షితంగా, సుస్థిరంగా ఉండేందుకు చర్యలు చేపట్టాలని పిలుపిచ్చారు.  ఎనిమిది దేశాలకు చెందిన భద్రతాధికారులు బుధవారం ఆఫ్ఘనిస్థాన్ అంశంపై భారత జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఎ) అజిత్ దోవల్ అధ్యక్షతన జరిగిన ప్రాంతీయ భద్రత సమావేశం తర్వాత ఈ ప్రకటనను విడుదల చేశారు.
మధ్య ఆసియాదేశాలైన  తజకిస్థాన్, కిర్గిజ్‌స్థాన్, కజక్‌స్థాన్, ఉజ్బెకిస్థాన్, తుర్క్‌మెనిస్థాన్, రష్యా, ఇరాన్ దేశాల జాతీయ భద్రతా సలహాదారులు/భద్రతా మండలి కార్యదర్శులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.  చైనా, పాకిస్థాన్ దేశాల ప్రతినిధులు మాత్రం గైరజరయ్యారు. 
 
ఆఫ్ఘనిస్థానంలో తాలిబన్‌ల పాలనపై ఈ సమావేశం ఎలాంటి విమర్శలు చేయలేదు. పైగా ఆఫ్ఘనిస్థాన్ ప్రాదేశిక సమగ్రతను  కాపాడాలని, బయటి శక్తులు ఆఫ్ఘన్ వ్యవహారంలో జోక్యం చేసుకోకుండా చూడాలని స్పష్టం చేశారు. ఇది పరోక్షంగా పాకిస్థాన్‌ను ఆఫ్ఘనిస్థాన్ వ్యవహారంలో జోక్యం చేసుకోవద్దన్న హెచ్చరికను చేసినట్లయింది.
యుద్దం వల్ల నష్టపోయిన ఆఫ్ఘనిస్థాన్‌లో భద్రత పరిస్థితుల కారణంగా దేశ ప్రజలు ఇబ్బందులు అనుభవిస్తుండటంపై ఈ సమావేశం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కుందుజ్, కాందహార్, కాబూల్‌లలో జరిగిన ఉగ్రవాద దాడులను సమావేశంలో పాల్గొన్న ఎనిమిది దేశాలకు చెందిన జాతీయ భద్రతా సలహాదారులు ఖండించారు.
శాంతి, భద్రత, సుస్థిరతల విషయంలో ఆఫ్ఘన్ ప్రజలకు సాయపడతామని కూడా ప్రకటించారు. తీవ్రవాదం, వేర్పాటువాదం, మాదకద్రవ్యాల రవాణా వంటి అంశాలపై ఉమ్మడిగా సహకారం అందించుకోవాలని ఈ సమావేశం అభిప్రాయపడింది. ఆఫ్ఘానిస్తాన్ లో మహిళలు, బాలలు, మైనారిటీ ప్రజల ప్రాధమిక హక్కులకు ఉల్లంఘనం జరగరాదని సమావేశం పిలుపిచ్చింది.
ఇటీవల ఆఫ్ఘన్ లో జరిగిన పరిణామాలు ఆ దేశంకే కాకుండా ఈ ప్రాంతం అంతటిపై తీవ్ర ప్రభావం చూపగలవాని ప్రారంభ ప్రసంగంలో అజిత్ దోవల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎదురయ్యే సవాళ్ళను ఎదుర్కోవడానికి ఈ ప్రాంతంలోని దేశాల మధ్య సన్నిహితమైన సంప్రదింపులు, సహకారం అవసరమని స్పష్టం చేశారు.

 ఆఫ్ఘనిస్థాన్ ప్రజలందరి అభీష్టాన్ని ప్రతిబింబించే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చింది. తాలిబన్లు ఆగస్టు 15న ఆఫ్ఘనిస్థాన్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్‌కు సన్నిహితుడు, ఐఎస్ఐ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఫయజ్ హమీద్ రెండుసార్లు కాబూల్‌లో పర్యటించారు. 

ఉగ్రవాద సంస్థ హక్కానీ నెట్‌వర్క్ చీఫ్ సిరాజుద్దీన్ హక్కానీకి ఫయజ్ హమీద్ గట్టి మద్దతుదారుగా కనిపించారు. ఈ నేపథ్యంలో ఈ సమావేశం పాకిస్థాన్ కు జోక్యం తగదంటూ పరోక్షంగా స్పష్టమైన సంకేతాలను పంపించింది.