
ఎడతెరిపి లేని వర్షాలు చెన్నైని కుదిపేస్తున్నాయి. దీంతో సిటీలోని పలు ప్రాంతాలతో పాటు సబర్బన్ ఏరియాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. చెన్నైలో భారీ వర్షాలు ప్రజలను అతలాకుతలం చేస్తున్నాయి. నిన్నటి నుంచి బీభత్సంగా వాన పడుతోంది. గత రాత్రి నుంచి చెన్నైలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షం నమోదు కావడంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి.
దీంతో పలు చోట్ల ట్రాఫిక్ నిలిచిపోయింది. పెరంబూర్ బ్యారక్స్ రోడ్డు, ఒట్టేరి వంతెన, పాడి తదితర ప్రాంతాలు కంప్లీట్‌గా నీట మునిగాయి. దీంతో వాటర్ లాగింగ్ ఏరియాల్లో స్వయంగా ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ పర్యటించారు. అప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేసి వాటర్ లాగింగ్స్ లేకుండా చర్యలు తీసుకున్నారు. భారీ వర్షం కారణంగా ఎంతమేర నష్టం కలిగిందనే విషయాన్ని అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు.
ఈమధ్య కాలంలో చెన్నైలో అత్యధిక వర్షపాతం నమోదు కావడం ఇదే మొదటిసారి. మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. చెన్నై నగరంలోని చెంబరంపాక్కం చెరువు గేట్లను తెరవాలని నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో చెంబరంపాక్కం కాలువ వెంబడి ఉండే గ్రామాల్లోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరించింది.
వర్షాల కారణంగా చెన్నై నగరంలోని రహదారులన్నీ నీటితో నిండిపోయాయి. ఇళ్లలోకి వరద నీరు చేరగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. చెన్నైతో పాటు తిరువల్లూర్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో ఉంటున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కాంచీపురం, తిరువళ్లూరు జిల్లా కలెక్టర్లకు స్టేట్ వాటర్ రిసోర్సెస్ అధారిటీ సూచించింది.
శనివారం ఉదయం నుంచి చెన్నై, కాంచీపురంలోని పలు సబర్బన్ ఏరియాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో చాలా ప్రాంతాల్లో ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయ కలిగింది. 2015 నుంచి ఇంత భారీ వర్షాలు సిటీలో చూడలేదని ప్రైవేటు వెదర్ బ్లాగర్స్ చెబుతున్నారు.
అయితే నవంబరు 11 వరకు చెన్నై నగరంలో మోస్తారు వర్షాలు కురుస్తాయని ఇండియన్ మెట్రాలాజికల్ డిపార్ట్‌మెంట్ (ఐఎండీ) అంచనా వేసింది. తమిళనాడుతో పాటు మహారాష్ట్ర, పుదుచ్చేరి, కేరళ, కర్నాటక, కోస్తాంధ్ర ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.
More Stories
రాజ్యాంగ ధర్మాసనానికి స్వలింగ వివాహాల అంశం
వరంగల్ KMC: ప్రీతిపై వేధింపుల కేసులో తెరపైకి తెలంగాణ హోంమంత్రి పేరు!
2019లో కన్నా 2024లో బిజెపికి ఎక్కువ సీట్లు