
దేశంలో కరోనా తగ్గుముఖం పట్టడంతో ఆర్ధిక కార్యకలాపాలు మెరుగు పాడడం దీపావళి పండుగను హుషారుగా జరుపుకోవడంతో వెల్లడవుతుంది. గత పదేళ్ల కాలంలో అత్యధికంగా ఈ పండుగకు దేశంలో వ్యాపార కార్యకలాపాలు జరగడం ఈ అంశాన్ని వెల్లడి చేస్తుంది
అందుకు నిదర్శనంగా, ఈ ఏడాది దీపావళి పండుగకు జరిగిన వ్యాపార విక్రయాలు రూ. 1.25 లక్షల కోట్లు దాటినట్లు కాన్ఫడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సిఎఐటి) తెలిపింది. గత పదేండ్లలో ఇంత రాబడి రాలేదని పేర్కొన్నది. పదేండ్ల తర్వాత రికార్డు స్థాయిలో విక్రయాలు జరిగాయని స్పష్టం చేసింది.
దీంతో గత రెండేండ్లుగా మందకొడిగా సాగిన వ్యాపార విక్రయాలకు తెరపడింది. నవంబర్ 14 నుంచి ప్రారంభమయ్యే వివాహాల సీజన్కు వ్యాపారులు తమ విక్రయాలను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా సిఎఐటి సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ మాట్లాడుతూ.. ఈ సంవత్సరం దీపావళి పండుగ సందర్భంగా దేశం మొత్తం మీద సుమారు రూ. 1.25 లక్షల కోట్ల వ్యాపారం జరిగిందని తెలిపారు. గత పదేండ్లలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో వ్యాపారం జరిగిందని చెప్పారు. ఒక్క ఢిల్లీలోనే రూ. 25 వేల కోట్ల వ్యాపారం జరిగిందని పేర్కొన్నారు.
పైగా, ఈ దీపావళికి చైనా ఉత్పత్తులు విక్రయించలేదని, స్వదేశీ ఉత్పత్తులపైనే వినియోగదారులు దృష్టి సారించారని ఆయన వెల్లడించారు. సాంప్రదాయ వస్తువులైన మట్టి దీపాలు, దీపాల రంగుల అలంకరణ, మట్టి బొమ్మలు, కొవ్వొత్తులకు డిమాండ్ పెరిగిందని చెప్పారు. దీంతో కుమ్మరులు, హస్త కళాకారులకు మంచి డిమాండ్ వచ్చిందని, వారి వ్యాపారం గణనీయంగా పెరిగిందని తెలిపారు. మరోవైపు, స్వీట్లు, డ్రై ఫ్రూట్స్, ఎల్ఈడీ బల్బులు, గృహాలంకరణ తదితర వస్తువులకు కూడా విపరీతమైన గిరాకీ ఏర్పడిందని వివరించారు.
More Stories
ప్రపంచవ్యాప్తంగా ప్రమాదంలో ఆర్ధిక వ్యవస్థ
ప్రపంచ బ్యాంకింగ్ సంక్షోభంపై భారత్ అప్రమత్తం
5జీ కోసం జియో లక్ష టవర్లు