ఆధ్యాత్మికత, సేవ రెండూ వేరు కాదు

 ఆధ్యాత్మికత, సేవ రెండూ వేరు వేరు కాదని స్పష్టం చేస్తూ  ఆధ్యాత్మిక మార్గం అంటే పూజా విధానం కాదని, మనోబలాన్ని పెంచే మహోన్నత జీవన విధానమని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు తెలిపారు. మన విద్యుక్త ధర్మాన్ని త్రికరణశుద్ధిగా నిర్వహించడమే ఆధ్యాత్మిక చైతన్యమని పేర్కొన్నారు.

విశాఖపట్నంలో శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పూర్వ పీఠాధిపతి ఉమర్ అలీషా గారి జీవిత చరిత్రను, పార్లమెంట్ ప్రసంగాల పుస్తకాలను ఆయన ఆవిష్కరిస్తూ  స్వీయ ఆధ్యాత్మిక మార్గం ద్వారా భగవంతుని ప్రేమను పొందడమే సూఫీ తత్వమని చెప్పారు. సర్వమతాలు ఇదే సిద్ధాంతాన్ని ప్రవచించాయని తెలిపారు.

ఆధ్యాత్మికత అనేది సమాజ మేలును కాంక్షించేదిగా ఉండాలన్న ఉపరాష్ట్రపతి, ఆధ్యాత్మికవేత్తలు ప్రజల్లోకి వెళ్ళి, వారిలో చైతన్యం తీసుకువచ్చినప్పుడే గొప్ప కార్యాలు సాధించడం సాధ్యమౌతుందని సూచించారు.  “ఎలాగైతే పొట్టులేని విత్తనం మొలకెత్తదో, అదే విధంగా సంఘటిత కృషి లేని ప్రయత్నాలు రాణించవు” అన్న తమ తాత గారి మాటలను ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి, భారతీయులు బలంగా విశ్వసించిన వసుధైవ కుటుంబ భావన స్ఫూర్తి ఇదేనని తెలిపారు. 

నలుగురితో పంచుకోవడం, నలుగు సంక్షేమం పట్ల శ్రద్ధ వహించడం ప్రతి ఒక్కరూ అలవరుచుకోవాలన్న ఆయన, సామాజిక బాధ్యత ద్వారా మన సంపద గొప్పతనాన్ని సంతరించుకుంటుందని తెలిపారు. స్వాతంత్య్ర ఉద్యమంలో తమ జీవితాలను త్యాగం చేసిన మహనీయుల నుంచి భారతీయ యువత స్ఫూర్తి పొందాలని, తద్వారా నవభారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని  ఉపరాష్ట్రపతి  ఈ సందర్భంగా ఆకాంక్షించారు.  ఆ మహనీయుల కృషి చేసింది వారి కోసం కాదని, భవిష్యత్ తరాల అభివృద్ధి కోసమని తెలిపారు. వివక్షలకు తావులేని సమాజ నిర్మాణమే వారికి మనం అందించే నిజమైన నివాళి అని ఆయన పేర్కొన్నారు.

1885 – 1945 మధ్య కాలానికి చెందిన ఉమర్ అలీషా గొప్ప స్వాతంత్య్ర సమరయోధులన్న ఉపరాష్ట్రపతి, మహా పండింతుడు, మేధావి, బహు గ్రంథకర్త, మహావక్త అయిన అలీషా  అంగ్లేయుల కాలంలో కేంద్ర చట్టసభ సభ్యులుగా వారు సేవలందించారని తెలిపారు. స్వరాజ్యం కోసం తమ వాణిని చట్టసభల్లో బలంగా వినిపించిన  అలీషా చట్టసభల ప్రసంగాలను పుస్తకంగా తీసుకురావడం అభినందనీయమని తెలిపారు.
భరతమాత దాస్య శృంఖలాలను తెంచేందుకు చరిత్రలో ఎందరో మహనీయులు తమ జీవితాలను త్యాగం చేశారని కొనియాడారు

తొలుత అక్షర జ్ఞానం కలిగిన చైతన్యవంత జనసముదాయం తమదైన పాత్రను పోషించేందుకు సిద్ధమైందని, వారి కృషి సామాన్య జనాలకు సైతం స్ఫూర్తిని పంచి స్వరాజ్య ఉద్యమం దిశగా నడిపిందని తెలిపారు. ఈ నేపథ్యంలో సాహితీ, సేవా రంగాల్లో  ఉమర్ అలీషా తమదైన ముద్రను వేశారని తెలిపారు. 

సంస్కృతం, పారశీకం, తెలుగు, ఇంగ్లీషు, ఫ్రెంచ్ భాషల్లో ప్రవేశం ఉన్న ఆయన అనేక పురాణేతిహాసాలను సైతం ఔపోసన పట్టారని ఉపరాష్ట్రపతి తెలిపారు. ఆధ్యాత్మిక మార్గం అంటే సేవా మార్గమే అని చాటిచెప్పిన మానవతావాదిగా అలీషాను అభివర్ణించారు. సామాజిక చైతన్యం కోసమే గాక, మహిళా సాధికారత కోసం వారు కృషి చేశారని పేర్కొన్నారు.

మహిళలకు సమానమైన భాగస్వామ్యం కల్పించడం ద్వారానే వేగవంతమైన పురోగతి సాధ్యమౌతుందని విశ్వాసం వ్యక్తం చేసిన ఉపరాష్ట్రపతి, స్వాతంత్ర్యంకు పూర్వమే ఉమర్ అలీషా   మహిళాభ్యుదయం కోసం కృషి చేశారని తెలిపారు. భారతీయ సంప్రదాయం స్త్రీలకు ఎంతో గౌరవాన్ని, ప్రాధాన్యతను ఇచ్చిందన్న ఆయన, మహిళా సాధికారత సాధ్యం కావాలంటే ముందు మన మనసుల్లో మార్పు రావాలని సూచించారు. ఈ దిశగా సమాజం దృష్టి కోణం మారాలని చెప్పారు. 

జాతీయ వాదాన్ని, సంఘసంస్కరణను బోధించిన ఉమర్ అలీషా స్ఫూర్తితో శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహించడం పట్ల ఆనందం వ్యక్తం చేసిన ఉపరాష్ట్రపతి, ఈ సంస్థను ఆధ్యాత్మికంగానే గాక, సేవా మార్గంలోనూ మరింత ముందుకు తీసుకువెళుతున్న ప్రస్తుత పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా ను అభినందించారు. భవిష్యత్తులోనూ వారి సేవా కార్యక్రమాలు ఇదే విధంగా కొనసాగాలని ఆకాంక్షించారు.