పెట్రోల్ ధరలు తగ్గించాలని తెలుగు రాష్ట్రాలపై వత్తిడి

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీపావళి పండుగ పురస్కరించుకొని దేశ ప్రజలకు బహుమతిగా పెట్రోల్ డీజిల్ ధరలపై ఎక్సైజ్ సుంకంను భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడం, ఆ వెంటనే బిజెపి పాలిత రాష్ట్రాలతో పాటు 13 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా విలువ ఆధారిత పన్ను (వాట్)ను తగ్గించడం ద్వారా వినియోగదారులకు విశేషంగా ఉపశమనం కలిగించడం తెలుగు రాష్ట్రాలలో కలకలం రేపుతున్నది.

దేశం మొత్తం మీద ఎక్కువగా వాట్ పన్ను విధిస్తూ, వినియోగదారులపై పెను భారం మోపుతున్న రాష్ట్రాలలో రెండు తెలుగు రాష్ట్రాలు ఉండడం గమనార్హం. అందుకనే ఇక్కడ కూడా వాట్ తగ్గించడం ద్వారా వినియోగదారులకు ఉపశమనం కలిగించాలని బిజెపితో పాటు ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

ఇప్పటికే తీవ్రమైన ఆర్ధిక సంక్షోభాలలో చిక్కుకున్న కె చంద్రశేఖరరావు (తెలంగాణ), వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి (ఏపీ) ప్రభుత్వాలను ఈ పరిణామం ఆత్మరక్షణలో పడవేస్తున్నది. రెండు రాష్ట్రాల బిజెపి అధ్యక్షులు ఇక్కడ కూడా వాట్ తగ్గించ వలసిందే అంటూ రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.

కాగా, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అభినందించకపొగా, టీఆర్‌ఎస్ నాయకులు విమర్శలు చేయడం సిగ్గుచేటని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డీకే అరుణ కేసీఆర్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఎన్డీయే పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే వ్యాట్‌ను తగ్గించి ప్రజలకు భారం తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంటే.. కేసీఆర్ మాత్రం సోయి కూడా లేదని ఆమె ఘాటుగా విమర్శించారు.

 రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ను తగ్గించాలని ఆమె డిమాండ్ చేశారు. కేసీఆర్‌కు ప్రజల సమస్యలపై పట్టింపు లేదని అరుణ దుయ్యబట్టారు. పెట్రో రేట్లను కేంద్రం తగ్గించిందని, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ధరలు తగ్గించాలని బిజెపి శాసనసభా నాయకుడు రాజా సింగ్ కూడా  డిమాండ్ చేశారు.

‘పెట్రోల్, డీజిల్ పై కేంద్ర ప్రభుత్వం ధరలు తగ్గించింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా ధరలు తగ్గించాలి’ అని ఆయన స్పష్టం చేశారు.  తెలంగాణ సర్కారు పెట్రోల్ మీద ఒక లీటర్‌‌కు రూ.41 ట్యాక్స్ వేస్తోందని చెబుతూ డీజిల్ పై 8 నుంచి 10 రూపాయలు కేసీఆర్ ప్రభుత్వం తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు.

ప్రతి దానికి కేంద్రంపై విమర్శలు చేయడం కాదు.. సెంట్రల్ సర్కారు ధరలు తగ్గించినప్పుడు రాష్ట్ర  బాధ్యతగా ఇంధన ధరలు తగ్గించాలని రాజా సింగ్ ఎద్దేవా చేశారు. బిజెపి తెలుగు రాష్ట్రాల అధ్యక్షులు బండి సంజయ్, సోము వీర్రాజు సహితం ఇటువంటి డిమాండ్లు చేశారు. వాట్ ను తగ్గించడం ద్వారా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సహితం రాష్ట్ర ప్రజలకు పెట్రోల్ ధరల నుండి ఉపశమనం కలిగించాలని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. తెలంగాణాలో లీటర్ కు రూ 26 వాట్ విధిసుండగా, ఏపీలో రూ 31 వసూలు చేస్తున్నారు.

  కేంద్రం తరహాలోనే ఏపీ ప్రభుత్వం కూడా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని టిడిపి నేత జ్యోతుల నెహ్రూ డిమాండ్ చేశారు. రాష్ట్ర వాటాగా పెట్రోల్‌పై రూ.10, డీజిల్‌పై రూ.20 తగ్గించాలని ఆయన కోరారు. లేని పక్షంలో టీడీపీ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.