అమెరికాకు ఆఫ్ఘన్ నుంచి ఉగ్రముప్పు 

అగ్రరాజ్యం అమెరికాకు ఉగ్ర ముప్పు ఉన్నట్లు హెచ్చరికలు వస్తున్నాయి. ఆఫ్ఘనిస్తాన్‌ నుండి తమ బలగాలను ఉపసంహరించుకున్న అమెరికా… అదే దేశం నుండి ముప్పును ఎదుర్కోనుందని తెలుస్తోంది. ఆఫ్ఘన్‌లో ఉగ్రవాద చర్యలను నియంత్రించామని పేర్కొంటూ అమెరికా తన బలగాలను ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభించగానే… తాలిబన్లు దేశాన్ని తమ చెప్పుచేతల్లోకి తెచ్చుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేశారు. ఎట్టకేలకు గత నెల నుండి తాలిబన్ల పాలన సాగుతోంది. 
 
ఆల్‌ఖైదా, ఇస్లామిక్‌ స్టేట్‌ వంటి ఉగ్ర సంస్థలు తమ ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రానున్న ఆరు నెలల్లో అమెరికాపై ఇస్లామిక్‌ స్టేట్‌ దాడి చేసే అవకాశాలున్నాయని నిఘా వర్గాలు చెబుతున్నాయని పెంటగాన్‌ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. ఆ దేశం నుండి తీవ్రముప్పు ఉందని కాంగ్రెస్‌కు వెల్లడించారు.

ఆఫ్ఘన్‌లోని తాలిబన్లు సైతం ఇస్లామిక్‌ స్టేట్‌ చర్యలను వ్యతిరేకిస్తోంది. ఇటీవల దేశంలో జరిపిన మారణకాండను సైతం ఖండించింది. ఇస్లామిక్‌ స్టేట్‌కు వ్యతిరేకంగా చర్యలు చేపట్టాలని తాలిబన్‌ ప్రభుత్వం ఆశిస్తోంది. అయితే అది సాధ్యమయ్యే పనేనా అన్నది సందేహం కలగకమానదు. 
ఎందుకంటే.. అనేక మంది ఉగ్రవాదుల సమూహమే ఐఎస్‌. దీన్ని కట్టడి చేయాలంటే తాలిబన్‌ ప్రభుత్వానికి సాధ్యపడదు. అంతేకాకుండా తమ ఉనికిని చాటి చెప్పేందుకు ఐఎస్‌ ఉగ్రవాద చర్యలకు పాల్పడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో అమెరికాపై ఉగ్రదాడికి సిద్ధమౌతుందని తెలుస్తోంది.
 
ఇలా ఉండగా,  భద్రతా దళాలు ఉపసంహరించుకున్న దాదాపు రెండు నెలల తర్వాత ఇంకా 450 మంది వరకు అమెరికన్ పౌరులు ఆఫ్ఘనిస్తాన్‌లో ఉండిపోయారని పెంటగాన్‌ అంచనా వేసింది. వీరంతా ఆ దేశాన్ని విడిచిపెట్టాలనుకుంటున్నారని అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. 
ఈ సమాచారాన్ని సెనేట్‌లో పెంటగాన్‌ బహిరంగపరిచింది. ఆఫ్ఘనిస్తాన్‌లో ఉండిపోయిన వారిలో చాలా మందితో అమెరికా సంప్రదింపులు జరుపుతున్నదని కూడా వెల్లడించింది.
 
భద్రతా బలగాలను ఉపసంహరించుకున్న తర్వాత ఆఫ్ఘాన్‌లోని తాలిబాన్‌తో అమెరికాకు ప్రత్యక్ష సంభాషణలు ఇంతవరకు జరుగలేదు. ఇటీవలి మాస్కో ఫార్మాట్‌లో కూడా అమెరికా పాల్గొనలేదు. ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్న తమ దేశ పౌరులను తరలించేందుకు అమెరికా పాకిస్తాన్‌, ఇరాన్‌, ఖతార్‌ దేశాల సాయం తీసుకునేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తున్నది.