ఏపీలో గంజాయిపై కేంద్ర హోంమంత్రిత్వ ట్కాస్క్‌ఫోర్స్‌

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాదకద్రవ్యాల కేంద్రంగా మారిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ఏపీ గంజాయి ప్రభావం దేశవ్యాప్తంగా పడుతుందని పేర్కొన్నారు. దానిని అరికట్టేందుకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అంతర్రాష్ట్ర ట్కాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

గంజాయి నివారణకు రాష్ట్ర ప్రభుత్వ నేతలు చర్యలు తీసుకోవట్లేదని మండిపడ్డారు. ఏపీ నుండి దేశంలోని ఇతర ప్రాంతాలకు మాదక ద్రవ్యాలు రవాణా చేస్తున్నారని చెప్పారు. ఈ విషయంపై హైదరాబాద్‌ సీపీ, నల్గొండ ఎస్పీ చేసిన వ్యాఖ్యల వీడియోను పవన్  ట్విట్టర్ లో షేర్ చేశారు.  2018లో తన పోరాట యాత్రలో చాలా ఫిర్యాదులు వచ్చాయని గుర్తు చేశారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు పోరాటయాత్ర చేసిన సమయంలో స్థానికులు ఒక క్లిష్టమైన క్రిమినల్ నెట్‌వర్క్ ఉందని తన దృష్టికి తీసుకు వచ్చారని వెల్లడించారు.

అయితే దానిని బహిర్గతం చేయడానికి వారు భయపడ్డారని చెప్పారు. ఏవోబీలో గంజాయి మాఫియాపై.. నిరుద్యోగం, అక్రమ మైనింగ్‌కు సంబంధించి ఫిర్యాదులచ్చాయని పవన్‌ తెలిపారు.

  గతంలో గంజాయి పంటను పోలీసులు, అబ్కారీ అధికారులు ధ్వంసం చేసేవారని జనసేన అధినేత గుర్తుచేశారు. ఇప్పుడు ఆ పని వదిలి, కేవలం బయటకు వెళ్లే గంజాయిని పట్టుకుంటున్నారని చెప్పారు.అయితే  సీజ్ చేసిన దానికంటే.. రాష్ట్రం దాటిపోతున్న సరుకే ఎక్కువని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. 

ఏపీలో డ్రగ్స్‌పై జనసేన అధినేత పవన్‌కల్యాణ్ వరస ట్వీట్లు చేశారు.గంజాయి సాగు నిజంగా సామాజిక ఆర్థిక అంశమని చెప్పారు. విశాఖ మన్యం నుంచి తుని వరకు ఉపాధి లేని, చదువు పూర్తయిన యువకులు ఈ వలలో చిక్కుకుంటున్నారని విచారం వ్యక్తం చేశారు. కింగ్‌ పిన్స్ మాత్రం రిస్క్‌ లేకుండా సంపాదిస్తున్నారని ఆరోపించారు. మన్యంలో ఇప్పుడు గంజాయి పంట ముఖ్య దశలో ఉందని పేర్కొన్నారు. నవంబర్, డిసెంబర్ నుంచి కటింగ్ మొదలవుతుందని,  అప్పుడు ఇంకా ఎక్కువ బయటకు వస్తుందని తెలిపారు.