
హుజురాబాద్ ఉపఎన్నికలో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డిపై ఇల్లందకుంట మండలం సిరిసేడు గ్రామంలో ప్రచారం చేస్తున్న సమయంలో టీఆర్‌ఎస్ నాయకులు దాడి జరిపే ప్రయత్నం చేయడం తీవ్ర ఉద్రిక్తకు దారితీసింది. అక్కడ కిషన్ రెడ్డి రోడ్ షో జరుపుతూ ఉండగా బిజెపి, టీఆర్‌ఎస్ కార్యకర్తలు ఒకరికొక్కరు ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా పోటీపడి జై కేసీఆర్, జై ఈటెల అం ఇరువర్గాలు పోటీపడి నినాదాలు ఇచ్చుకున్నారు. ఇరువర్గాలు తోపులాటలు దిగారు. పోలీసులు జోక్యం చేసుకొని ఇరువర్గాలను శాంతింప చేశారు. ఈ సందర్భంగా కొద్దిసేపు ట్రాఫిక్ స్తంభించి పోయింది.
కేంద్ర మంత్రి రోడ్ షో చేస్తుండగా అటువైపు టీఆర్‌ఎస్ కార్యకర్తలను ఏ విధంగా అనుమతించారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. కేవలం కేంద్రమంత్రిపై దాడి చేసేందుకు పధకం పన్నారని ఆరోపించారు. కేంద్ర మంత్రిపై దాడికి ప్రయత్నం చేస్తున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశంపైననే ఈ విధంగా జరిగిందని ధ్వజమెత్తారు.
‘హుజూరాబాద్ ఉపఎన్నికలో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ప్రజల మనసు మార్చలేమని సీఎం కేసీఆర్ గ్రహించారు. ప్రజాప్రతినిధులను కొనుగోలు చేసినా ఫలితం లేదనిఆయనకు అర్థమైంది. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి శాంతిభద్రతల సమస్యను సృష్టించి ఎన్నికలను వాయిదా వేయించేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారు’ అని సంజయ్ ఆరోపించారు.
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రచారం చేస్తుండగా టీఆర్‌ఎస్ నేతలు దాడి చేసి అడ్డుకునే ప్రయత్నం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, సీఎం కేసీఆర్ డైరెక్షన్‌లో ఈ దాడి జరిగిందని ఆరోపించారు. పోలింగ్‌కు ప్రజలు రాకుండా భయభ్రాంతులకు గురిచేసేలా కేసీఆర్ కుట్ర చేస్తున్నారని, జీహెచ్‌ఎంసీ ఎన్నికల సమయంలోనూ టీఆర్‌ఎస్ రెచ్చగొట్టే ప్రయత్నం చేసి విఫలమైందని విమర్శించారు.
బీజేపీ దాడులు చేస్తోందని, మత కల్లోలాలు సృష్టించే కుట్ర చేస్తోందంటూ ఆనాడు దుష్ప్రచారం చేసి విఫలమయ్యారని, హుజూరాబాద్ ఉపఎన్నికలోనూ మళ్లీ ఇదే కుట్రను అమలు చేయబోతున్నారని ధ్వజమెత్తారు. అవినీతి సొమ్ముతో అక్రమాలే లక్ష్యంగా వ్యవహరిస్తున్న టీఆర్‌ఎస్ పార్టీ బెదిరింపులకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు.
హుజూరాబాద్ ఉప ఎన్నికలో వంద కోట్లు ఖర్చు పెట్టినా టీఆర్‌ఎస్ గెలవని పరిస్థితి నెలకొనడంతో, ప్రతి సర్వే కూడా అధికార పక్షంపై ప్రతికూలంగా ఉండడంతో గెలుపు మీద నమ్మకం పోగొట్టుకున్న కేసీఆర్ శాంతిభద్రతల సమస్యలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. దాడులు చేసి అడ్డుకుంటామంటే ఊరుకోం ఖబడ్దార్ అని హెచ్చరించారు. టీఆర్‌ఎస్ నాయకుల దాడికి సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
పోలీసులు అధికార పార్టీకి కొమ్ము చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల కమిషన్‌కు దాడిపై ఫిర్యాదు చేస్తామని చెప్పారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిపై దాడికి నిరసనగా శనివారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతామని వెల్లడించారు.
‘ఓటమి భయంతోనే టీఆర్‌ఎస్ నేతలు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి క్యాంపెయిన్‌పై దాడి చేశారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి మేం ఏమైనా చేస్తామనే సందేశాన్ని ఇవ్వాలని టీఆర్‌ఎస్ యత్నిస్తోంది. బీజేపీ ప్రచారాన్ని టీఆర్‌ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. డబ్బుతో ఓట్లను కొంటాం. రాష్ట్రాన్ని కొల్లగొట్టినం. అవినీతి సొమ్మంతా మా దగ్గరుంది. ఏదైనా చేస్తామని కేసీఆర్ అనుకుంటున్నారు’అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మండిపడ్డారు.
ఉపఎన్నికను అధికారాన్ని అడ్డుపెట్టుకుని గెలవాలనే తీరును చూస్తుంటే జాలేస్తోందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ తాటాకు చప్పుళ్లకు బీజేపీ భయపడదని ఆమె స్పష్టం చేశారు. అవినీతి సొమ్మును ఉపయోగించి గెలుస్తామనే బ్రమ సీఎం కేసీఆర్‌కు తొలిగిపోయిందని ఎద్దేవా చేశారు.
More Stories
భారత్‌ను చైనాకు దూరం చేసి అమెరికాకు దగ్గర చేసుకోవడమే
`ఓటు యాత్ర’ జనాన్ని ఆకట్టుకున్నా, ఓట్లు పెంచలేదు!
నేపాల్ కల్లోలం వెనుక అమెరికా `డీప్ స్టేట్’!