రామప్ప దేవాలయం అభివృద్ధికి పూర్తి సహకారం

వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు పొందిన అతి ప్రాచీన కట్టడం అయిన రామప్ప దేవాలయం అభివృద్ధికి పూర్తి స్థాయిలో సహకరిస్తామని, టూరిజం కోసం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తామని  కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి  జి కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల్లోనే మొట్ట మొదటిసారిగా ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో నుంచి గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం దేశానికే గర్వకారణమని కిషన్‌రెడ్డి చెప్పారు. 
రామప్పకు యునెస్కో గుర్తింపు లభించిన తర్వాత తొలిసారి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి గురువారం రామప్పను సందర్శించారు. తెలుగు రాష్ట్రాల్లో అనేక కట్టడాలు ఉన్న గుర్తింపు తెచ్చుకోలేకపోయాయని విచారం వ్యక్తం చేశారు. ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా రామప్పను అన్నివిధాలా అభివృద్ధి చేస్తామని వివంచారు. ఇప్పటికే ప్రణాళికను సిద్ధం చేసినట్లు వెల్లడించారు. గిరిజన దర్శన్‌లో భాగంగా గట్టమ్మ దేవాలయం నుంచి బొగత జలపాతం వరకు రూ.80 కోట్ల నిధులతో పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసినట్లు తెలిపారు.

రామప్ప, వేయిస్తంభాల దేవాలయం, వరంగల్‌ కోటలను యుద్ధప్రాతిపదికన అభివృద్ధి చేసేం దుకు ప్రత్యేకశ్రద్ధ చూపుతామని మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని చారిత్రక ప్రాంతాలతో పాటు హైదరాబాద్‌లోని పురాతన కట్టడాలు, ప్రదేశాల అభివృద్ధికి నిధులు కేటాయించడం జరిగిందని, ప్రస్తుతం పనులు పురోగతిలో ఉన్నాయన్నారు.

వరంగల్‌లో విమానాశ్రయాభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని, ఇది వినియోగంలోకి వస్తే విదేశీ పర్యాటకులు పెద్దసంఖ్యలో వస్తారన్నారు. రామప్ప సందర్శను వచ్చే దేశీయ పర్యాట కులకు విమానచార్జీలపై రాయితీ ఇస్తామని వెల్లడించారు. చాలా దేశాలు రామప్ప దేవాలయం ను వ్యతిరేకించాయని గుర్తు చేశారు. అయితే దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏ దేశాలు అయితే రామప్ప గుర్తింపు కు అడ్డుకున్నాయో వాటి ద్వారానే అద్భుత కట్టడం అని చెప్పించిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందని ఆయన కొనియాడారు.  

వరంగల్‌ కోట, వెయ్యి స్తంభాల గుడికి ప్రాధాన్యత ఇస్తూ పెద్ద ఎత్తున నిధులు ఇచ్చి, అభివృద్ధి చేస్తామని కేంద్ర మంత్రి భరోసా ఇచ్చారు. కరోనా కారణంగా విదేశీ టూరిస్టులు రావడంలేదని చెబుతూ కరోనా తగ్గుముఖం పట్టడంతో విదేశీ టూరిస్టులు వచ్చేందుకు మొగ్గుచూపుతున్నారన్నారని తెలిపారు. 
 
వరంగల్ ఎయిర్ పోర్టు ఇచ్చేందుకు కేంద్రం ప్రభుత్వం సుముఖంగా వుందని చెబుతూ ఎయిర్ పోర్టు వస్తే టూరిజం మరింతగా పెరుగుతుందని కిషన్ రెడ్డి చెప్పారు. తక్కువ ఛార్జీలతో వరంగల్ కి విమానాలను నడుపుతామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భూమి అప్పగిస్తే ఉడాన్ స్కిమ్ లో ఎయిర్ పోర్ట్ కు కృషి చేస్తామని చెప్పారు. 
రామప్పను ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించిన వివరాలతో కూడిన శిలా ఫలకాన్ని  కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆవిష్కరించారు. అదే విధంగా రామప్పలో చేపట్టే మౌలిక సదుపాయాలకు సంబంధించిన శిలాఫలకాన్ని కూడా ఆవిష్కరించారు. రామప్పకు యునెస్కో గుర్తింపును సాధించిపెట్టడంలో కృషి చేసిన పాండు రంగారావుతోపాటు పలువురిని ఈ సందర్భంగా శాలువాలు, జ్ఞాపికలతో సత్కరించారు.
 
అంతకుముందు ములుగులో గట్టమ్మ దేవాలయంలో రాష్ట్ర ఎక్సైజ్, టూరిజం అండ్ కల్చర్ శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ తో కలిసి కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. కేంద్ర ప్రభుత్వం నిధులతో తెలంగాణ లోని ఆలయాలు, టూరిజం అభివృద్ధి చేశామని హామీ ఇచ్చారు. కాగా, ఖిలావరంగల్‌ కోటను కేంద్ర ప్రభుత్వ నిధులతో పూర్తిస్థాయిలో అభివృద్ధి పరుస్తామని కిషన్‌రెడ్డి హామీ ఇచ్చారు. వరంగల్‌ ఉమ్మడిజిల్లా పర్యాటనలో భాగంగా ఖిలావరంగల్‌ కోటను సందర్శించారు. అద్భుత శిల్పాలను, లైట్‌ అండ్‌ సౌండ్‌ షోను ఆసక్తిగా తిలకించారు.