భారత్‌ పాకిస్తాన్‌తో టి20 మ్యాచ్‌ ఆడరాదు

కాశ్మీర్ లోయలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా ఈ నెల 24న జరుగవలసిన భారత్‌, పాకిస్తాన్‌తో ప్రపంచ కప్ టి20 మ్యాచ్‌ ఆడరాదని కేంద్రమంత్రి రాందాస్ అథవాలే స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు పెరుగుతున్నాయని, వలస కూలీల హత్యలతో లోయ దద్దరిల్లుతుందని ఆయన గుర్తు చేశారు. 

“పొరుగు దేశం పాకిస్తాన్‌ ఎలాంటి గుణ పాఠాలు నేర్చుకోలేదు. భారత దేశంపై వారి ఉగ్రచర్యలు ఆగడంలేదు. కాశ్మీర్‌ లోయలో పాకిస్తాన్ తన ఉగ్రవాద  కార్యకలాపాలను నిలిపివేయకపోతే, భారత్‌ ఆదేశం పై యుద్దం ప్రకటించాలి” అని ఆయన సూచించారు. 

జమ్మూ కాశ్మీర్‌లో  వలస కూలీలపై దాడులు జరుగుతున్నాయని పేర్కొంటూ  లోయలో అభివృద్ధిని అనుమతించకూడదనేది పాకిస్తాన్ ఎత్తుగడ అని విమర్శించారు. ఇటువంటి పరిస్థితుల్లో భారత్‌.. పాకిస్తాన్‌తో మ్యాచ్‌ ఆడకూడదని అథవాలే చెప్పారు. ఈ విషయంపై  బీసీసీఐ కార్యదర్శి జై షాతో చర్చిస్తానని అథవాలే తెలిపారు.

కాగా  ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా భారత్‌- పాకిస్తాన్‌ మ్యాచ్‌పై ఇటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే, టీ20 ప్రపంచకప్‌-2021లో భాగంగా భారత్‌-పాక్‌ల మధ్య అక్టోబర్‌ 24న జరగాల్సిన మ్యాచ్‌ను రద్దు చేయాలని దేశవ్యాప్తంగా డిమాండ్లు అధికమవుతున్నాయి.

సోషల్ మీడియా వేదికగా #BanPakCricket హ్యాష్‌ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. అయితే, ఐసీసీ టోర్నీలో ఓ జట్టుతో ఆడలేమని చెప్పడం సరికాదని బీసీసీఐ వర్గాలు స్పష్టం చేశాయి