ఉత్తరాఖండ్‌ లో వందేళ్లలో ఎరుగని భారీ వర్షాలు… 46 మంది మృతి

గత వంద సంవత్సరాల కాలంలో ఎరుగని భారీ వర్షాలతో దేవభూమి ఉత్తరాఖండ్‌లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీవర్షాలకు రాష్ట్రంలోని పలు జిల్లాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరద ఉద్ధృతికి పలు వంతెనలు కొట్టుకుపోయాయి. రైల్వేలైన్లు దెబ్బతిన్నాయి. పలు ఇండ్లు నేలమట్టమయ్యాయి. 

శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. వానలు, వరదల వల్ల జరిగిన వివిధ ప్రమాదాల్లో మంగళవారం ఒక్కరోజే 41 మంది మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 46కు చేరింది. పదుల సంఖ్యలో గల్లంతయ్యారు. 

వరదలు, కొండచరియలు విరిగిపడటంతో ప్రముఖ పర్యాటక ప్రాంతం నైనిటాల్‌కు వెళ్లే ప్రధాన మార్గాలన్నీ మూసుకుపోయాయి. జిల్లా కేంద్రం నుంచి బయటి ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నైనీ సరస్సు ఉప్పొంగడంతో.. ఒడ్డున ఉన్న నైనాదేవి ఆలయంతో పాటు మాల్‌ రోడ్డు వరదనీటిలో పూర్తిగా మునిగిపోయింది.

వరదనీటిలో చిక్కుకున్న వారికి సహాయం అందించడానికి ఎన్డీఆర్‌ఎఫ్‌, మూడు ఆర్మీ హెలికాప్టర్లు రంగంలోకి దిగాయని సీఎం పుష్కర్‌సింగ్‌ ధామి తెలిపారు. వరద ప్రభావిత జిల్లాల్లో ఏరియల్‌ సర్వే నిర్వహించారు. మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున పరిహారాన్ని, ఇండ్లు కూలిపోయిన వారికి రూ. 1.9 లక్షల చొప్పున సాయాన్ని ప్రకటించారు.

 వాతావరణ శాస్త్రవేత్తల ప్రకారం.. కుమావన్ ప్రాంతంలోని ముక్తేశ్వర్‌లో 107 సంవత్సరాల క్రితం సెప్టెంబర్ 18, 1914 న 254.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గత 24 గంటల్లో ముక్తేశ్వర్‌లో 340.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. చంపావత్‌లో 580 మి.మీ, నైనిటాల్‌లో 530 మి.మీ, జియోలికోట్ 490 మి.మీ, భీమ్‌టాల్ 400 మి.మీ, హల్ద్వానీలో 300 మి.మీ వర్షాపాతం రికార్డయింది.

ఇంకా చాలా ప్రాంతాల్లో 100 నుంచి 500 మిల్లీమీటర్లకుపైగా వర్షపాతం నమోదైంది. వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల కారణంగా రికార్డు స్థాయిలో వర్షం కురిసిందని వాతావరణ కేంద్రం డైరెక్టర్‌, సీనియర్‌ శాస్త్రవేత్త విక్రమ్‌ సింగ్‌ పేర్కొన్నారు.

పంత్‌నగర్ 31 సంవత్సరాల కిందట నమోదైన భారీ వర్షపాతం రికార్డు బద్దలైందన్నారు. 1990 జూలై 10న పంత్‌నగర్‌లో 228 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని, గత 24 గంటల్లో పంత్‌నగర్‌లో 403.9 మిల్లీమీటర్ల రికార్డయిందన్నారు. గతంలో కంటే రెట్టింపు స్థాయిలో వర్షం కురిసిందన్నారు. అయితే, గత 24 గంటల్లో రాష్ట్రంలో సగటున 1.1 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

రుతుపవనాల్లో మార్పుల కారణంగా ఊహించని రీతిలో రాష్ట్రవ్యాప్తంగా 122 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదైంది. పాశ్చాత్య అవాంతరాలు, ఆగ్నేయ గాలులు హిమాలయ ప్రాంతమైన లడఖ్, హిమాచల్ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలను, జమ్మూ కాశ్మీర్‌తో పాటు ఆఫ్ఘనిస్తాన్, దక్షిణ తజికిస్తాన్ ప్రాంతాలను కలిపే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి.