భారత్- పాక్ టీ-20 రద్దుకై పెరుగుతున్న డిమాండ్ 

కాశ్మీర్ లోయలో గత రెండు వారాలుగా కొనసాగుతున్న పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద చర్యల కారణంగా  టీ-20 వరల్డ్‌ కప్‌ లో భాగంగా భారత్ – పాకిస్థాన్ జట్ల మధ్య జరిగే ఆటను రద్దు చేయాలని భారత ప్రభుత్వంపై వత్తిడి పెరుగుతున్నది. 

టీ-20 మ్యాచ్‌పై ఒకసారి పునరాలోచించాలని కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ సూచించారు. ‘భారత్‌, పాక్‌ల మధ్య సరైన సఖ్యత లేనందున ఈ విషయాన్ని మరోసారి ఆలోచించాలి’ అంటూ పేర్కొన్నారు. ఈ నెల 24న దుబారులో భారత్‌-పాక్‌ల మధ్య మ్యాచ్‌ జరగనుంది.

జమ్ముకాశ్మీర్‌లో ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితుల దృష్ట్యా ఈ ఇరు దేశాల జట్ల మధ్య మ్యాచ్‌ జరగాలా అన్న ప్రశ్నకు ఆయన ఈ విధంగా స్పందించారు. గత కొన్ని రోజులుగా జమ్ముకాశ్మీర్‌లో ఉగ్రవాదులు పౌరులను లక్ష్యంగా చేసుకుంటున్నారని గుర్తు చేశారు. ఇటీవల కాలంలో 11 మంది పౌరులు, 9 మంది జవాన్లతో సహా మొత్తం 20 మందిని ఉగ్రవాదులు బలితీసుకున్న. పౌరులలో ఐదుగురు స్థానికేతరులు.

పంజాబ్ మంత్రి పర్గత్ సింగ్ సహితం అంతకు ముందు ఇటువంటి డిమాండ్ చేశారు. సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా ఈ ఆట ఆడటం సమంజసం కాదని స్పష్టం చేశారు. అయితే, ఇప్పుడు ఈ ఆటను రద్దు చేసుకోవడం సాధ్యం కాదని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. 

కాశ్మీర్ లోయలో బీహార్ కార్మికులను ఉగ్రవాదులు వరుసగా హత్యా చేస్తుండడంతో ఆగ్రహం చేసిన బీహార్ బీజేపీ నాయకులు సహితం ఈ ఆటను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాశ్మీర్ లోయలో అమాయక ప్రజలపై ఉగ్రవాదుల దాడి పిరికివారి చర్యగా అభివర్ణిస్తూ ప్రస్తుత పరిస్థితులతో పాకిస్థాన్ తో క్రికెట్ ఆడటం ఉగ్రవాదులను సమర్ధిస్తున్నట్లు తప్పుడు సంకేతం ఇచ్చే అవకాశం ఉన్నదని బీహార్ ఉప ముఖ్యమంత్రి తారకిశోర్ హెచ్చరించారు.