రైతుల నిరసనలలో ఏ అంశం ప్రస్తావించడం లేదు 

పంజాబ్, హర్యానా, తూర్పు ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లోనే రైతు నిరసనలు వ్యక్తమవుతున్నాయని పేర్కొంటూ ఫలానా అంశంపై నిరసన అంటూ ఇంతవరకూ స్పష్టంగా వాళ్లు (నిరసనకారులు) చెప్పడం లేదని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ గుర్తు చేశారు.  కనీస మద్దతు ధర అనే అంశం తీసుకుంటే ఎంఎస్‌పీ ప్రకటిస్తూనే ఉన్నామని చెప్పారు. 

ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న సీతారామన్ హార్వార్డ్ కెన్నడీ స్కూలులో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఫలానా విషయంపై నిరసన చేస్తున్నామని వారు చెప్పనప్పటికీ ఇవాల్టికి కూడా చర్చకు తాము సుముఖంగానే ఉన్నామని స్పష్టం చేశారు. 

సాగు చట్టాలపై రైతు నిరసనలపై అడిగిన ప్రశ్నకు నిర్మలా సీతారామన్ సమాధానమిస్తూ, దశాబ్దానికి పైగా వివిధ పార్లమెంటరీ కమిటీలతో చర్చలు జరిపిన తర్వాతే మూడు సాగు చట్టాలను తీసుకు వచ్చామని చెప్పారు. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ప్రభుత్వాలతో విస్తృతంగా చర్చలు జరిపామని పేర్కొన్నారు.

 ప్రతి ఒక్క భాగస్వామితోనూ చర్చించే చట్టాలు తెచ్చామని చెప్పారు. లోక్‌సభలో బిల్లు పెట్టినప్పుడు కూడా విస్తృత చర్చ జరిగిందని, వ్యవసాయ మంత్రి కూడా సమాధానం ఇచ్చారని తెలిపారు.అయితే  రాజ్యసభకు వచ్చినప్పుడే ప్రతిఘటనలు, రభస చేటుచేసుకున్నాయని తెలిపారు.

నలుగురు రైతుల మరణానికి దారితీసిన లఖింపూర్ ఖేరి ఘటనను ఖండిస్తున్నామని స్పష్టం చేస్తూ ఇలాంటి హింసాత్మక ఘటనలను ఎవరైనా ఖండించాల్సిందేనని తేల్చి చెప్పారు. అయితే, ఈ తరహా ఘటనలు ఒక ప్రాంతానికే పరిమితమై ఉండవని, దేశంలోని ఎక్కడ ఇలాంటి ఘటనలు జరిగినా, వాటిని ప్రస్తావించాల్సి ఉంటుందని ఆమె తెలిపారు. 

లఖింపూర్ ఖేరి హింసాత్మక ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర మంత్రులు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఆత్మరక్షణ పంథాలో ఎందుకు వ్యవహరిస్తాన్నారు? అంటూ  అడిగిన ప్రశ్నకు నిర్మలా సీతారామన్ ”అలాంటిదేమీ లేదు” అని సమాధానమిచ్చారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ప్రతి ఒక్కరూ ఖండిస్తారని, అందరి అభిప్రాయమూ ఒకేలా ఉంటుందని ఆమె పేర్కొన్నారు.

మిగతా చోట్ల ఘటనలు జరిగితే ఖండించరే?

ఇదే సమయంలో మిగతా చోట్ల ఇలాంటి ఘటనలు జరిగనప్పుడు కూడా అందరూ ఇదే తరహా ఆందోళన వ్యక్తం చేయాలని ఆమె హితవు చెప్పారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో జ‌రిగిన ఘ‌ట‌నే కాకుండా దేశ‌వ్యాప్తంగా ఎక్క‌డ ఇలాంటివి జ‌రిగినా వాటిని లేవ‌నెత్తాల‌ని మీతో పాటు డాక్ట‌ర్ అమ‌ర్త్య సేన్ వంటి వారిని తాను కోరుతున్నాన‌ని ఆమె చురకలు అంటించారు. 

విద్యావంతులు, విశ్లేషకులు ఎక్కువగా తమ తమ వ్యక్తిగత ఇష్టాయీష్టాల చట్రంలో బందీలయ్యారని నిర్మలా సీతారామన్ విమర్శించారు. ఇటువంటి వైఖరి చాలా ప్రమాదకరమని ఆమె పరోక్షంగా ఆర్థికవేత్త అమర్తాసేన్‌పై నిప్పులు చెరిగారు. క్షేత్రస్థాయి, వాస్తవిక పరిస్థితులు ఏమిటనేవి వారు పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. 

వీటి గురించి వారికి అవగావహన ఉన్నా వాటిని గాలికొదిలేస్తున్నారని, తాము ఏదైనా విషయంపై ఏర్పర్చుకుని ఉన్న అభిప్రాయాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆమె తెలిపారు. ఇదేం మేధాలక్షణమనేది అర్ధం కావడం లేదని స్పష్టం చేశారు. ఎవరికైనా దేనిపైనా అయినా ఎటువంటి అభిప్రాయం అయినా ఉండవచ్చు. అది వ్యక్తిగతం అవుతుంది. అయితే సామాజిక అంశాలపై అభిప్రాయాలు వాస్తవికత ప్రాతిపదికన ఉండటం మరో అంశం అని ఆమె పేర్కొన్నారు.

ఎవరికైనా వారి ఉద్ధేశాల ప్రకారం అభిప్రాయాలు ఖరారు అయి ఉంటే , ఇక అటువంటి వాటిపై తాను ఎటువంటి ఎదురుదాడికి దిగాల్సిన అవసరం లేదని, దిగినా ప్రయోజనం లేదని నిర్మల ఘాటుగానే స్పందించారు. ఇదంతా కూడా నిద్రనటిస్తున్న వారిని మేల్కొలిపే యత్నాలుగా ఉంటుందని ఎద్దేవా చేశారు. నిజంగానే నిద్రపోతున్న వారిని తట్టిలేపితే కొంత ప్రయోజనం ఉంటుంది. అయితే నిద్రపోతున్నట్లుగా నటించే వారిని లేవండని చెప్పడం వల్ల వారు లేస్తారా? లేవరే అని పేర్కొన్నారు.

లఖింపూర్ ఘటనలో తన క్యాబినెట్ సహచరుని కుమారుడికి చిక్కులు ఎదురయ్యాయని, అందులో ఆయన ప్రమేయం ఉందా లేదా అనేది కూడా విచారణలో తేలిన తర్వాతే తగిన న్యాయం జరుగుతుందని ఆమె భరోసా ఇచ్చారు.