బూస్టర్ డోసు వినియోగానికి సిఫార్సు

కరోనా వ్యాక్సిన్‌ను రెండు మోతాదుల్లో తీసుకున్నప్పటికీ,  బలహీన రోగ నిరోధక వ్యవస్థ ఉన్నవారికి బూస్టర్ డోసు అవసరమేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుల కమిటీ వెల్లడించింది. బూస్టర్ డోసుల వినియోగం గురించి ఇమ్యునైజేషన్‌పై ఏర్పాటైన వ్యూహాత్మక సలహాల నిపుణుల బృందం (ఎస్‌ఎజిఇ) నాలుగు రోజులు చర్చించిన తరువాత ఈ సిఫార్సు చేసింది. 

వీటికి సంబంధించిన తుది నివేదిక డిసెంబరులో విడుదల చేస్తామని ప్రకటించింది. రోగనిరోధక వ్యవస్థ మధ్యస్థాయి నుంచి తీవ్ర బలహీనంగా ఉండే వ్యక్తులకు రెండు డోసులు ఇచ్చినప్పటికీ వాటికి తగిన విధంగా స్పందించే అవకాశాలు తక్కువగా ఉంటాయి.దీంతో బలహీన రోగ నిరోధకత ఉన్నవారు తీవ్ర కరోనా  బారిన పడే ప్రమాదం ఉంటుంది.

అందుచేత డబ్లుహెచ్‌ఒ ఆమోదం పొందిన వ్యాక్సిన్ డోసులకు అదనంగా మరో డోసు ఇవ్వాల్సిన అవసరం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుల బృందం పేర్కొంది. ఇక చైనాకు చెందిన సినోవాక్, సినోఫార్మ్ వ్యాక్సిన్లు తీసుకున్న 60 ఏళ్లు పైబడిన వ్యక్తులు తప్పనిసరిగా మూడోడోసు తీసుకోవాలని స్పష్టం చేసింది.

వీటితోపాటు ఇతర వ్యాక్సిన్‌ల లభ్యతను బట్టి ఆయా దేశాలు మూడో డోసు అందించ వచ్చని సూచించింది. అయితే దీన్ని అమలు చేసే ముందు … రెండు డోసులు ఎక్కువ మందికి చేరిన తరువాత మాత్రమే మూడో డోసుపై ఆలోచించాలని పేర్కొంది. వ్యాక్సిన్ పంపిణీలో తొలుత వృద్దులకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుల బృందం సిఫార్సు చేసింది.

ఇక ఈ ఏడాది చివరినాటికి ప్రపంచ వ్యాప్తంగా కనీసం 40 శాతం మందికి రెండు డోసుల్లో వ్యాక్సిన్ అందించడంతోపాటు వచ్చే ఏడాది జూన్ నాటికి 70 శాతం మందికి వ్యాక్సిన్ పూర్తి చేసేలా అన్ని దేశాలు ప్రయత్నించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపునిచ్చింది. వ్యాక్సిన్ పంపిణీలో వృద్దులకు, ఆరోగ్య కార్యకర్తలకు, అధిక ముప్పు పొంచి ఉన్న వారికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. అనంతరం సాధారణ పౌరులకు యుక్తవయస్సు వారికి వ్యాక్సిన్ ఇచ్చే క్రమాన్ని అనుసరించాలని డబ్లుహెచ్‌ఒ పేర్కొంది.