భారత్ – చైనా చర్చల్లో కొనసాగుతున్న ప్రతిష్టంభన 

భారత్ – చైనా ల మధ్య ఆదివారం జరిగిన 13 వ రౌండ్ కార్ప్స్ కమాండర్-స్థాయి చర్చలు వాస్తవాధీన రేఖ వద్ద నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించడంలో ఎటువంటి ప్రభావం చూపలేక  పోయిన్నట్లు భారత్ సైన్యం సోమవారం ప్రకటించింది. తాము చేసిన   “నిర్మాణాత్మక సూచనలు” తమకు “ఆమోదయోగ్యం కాదు” కావని చైనా స్పష్టం చేసిన్నట్లు వెల్లడించింది. 

పైగా, నిర్దుష్టంగా ఎటువంటి ప్రతిపాదనలు కూడా చైనా చేయలేకపోయినదని చెప్పింది. అయితే, ఇరుపక్షాలు కమ్యూనికేషన్లను కొనసాగించాలని, క్షేత్రస్థాయిలో స్థిరత్వం కొనసాగించాలని అంగీకరించాయని పేర్కొన్నారు. “ద్వైపాక్షిక సంబంధాల మొత్తం దృక్పథాన్ని చైనా వైపు పరిగణనలోకి తీసుకోవాలని,  ద్వైపాక్షిక ఒప్పందాలు,  ప్రోటోకాల్‌లకు పూర్తిగా కట్టుబడి ఉంటూ మిగిలిన సమస్యల ముందు పరిష్కారానికి కృషి చేయాలని మన నిరీక్షణ” అని భారత సైన్యం  తెలిపింది.

తూర్పు లద్దాఖ్‌లో మిగిలిన వివాదాస్పద ప్రాంతాల నుంచి చైనా బలగాలు సాధ్యమైనంత త్వరగా వెనక్కి వెళ్లిపోవాలని భారత్‌ మరోసారి తేల్చిచెప్పింది.  ఇరు దేశాల నడుమ చుషుల్‌–మోల్డో బోర్డర్‌ పాయింట్‌ వద్ద చైనా వైపు భూభాగంలో ఉదయం 10.30 గంటలకు మొదలైన ఈ చర్చలు రాత్రి 7 గంటలకు ముగిశాయని భారత సైనిక వర్గాలు వెల్లడించాయి.

రెండు నెలల విరామం తర్వాత చర్చలు జరగడం గమనార్హం. ఇంతకు ముందు చర్చలు జూలై 31 న జరిగాయి. 8.30 గంటల పాటు సుదీర్ఘంగా సాగిన చర్చల్లో కీలకాంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలిపాయి. భారత్‌ తరఫు బృందానికి లేహ్‌లోని 14 కార్ప్స్‌ కమాండర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ పి.జి.కె.వీునన్‌ నేతృత్వం వహించారు. 

ప్రధానంగా తూర్పు లద్దాఖ్‌ హాట్‌స్ప్రింగ్స్‌ ప్రాంతంలోని పెట్రోలింగ్‌ పాయింట్‌(పీపీ)–15 నుంచి బలగాల ఉపసంహరణ గురించే చర్చలు జరిగాయి. 2020 మే 5వ తేదీన తూర్పు లద్దాఖ్‌లో భారత్‌–చైనా సైనికుల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇరువైపులా పదుల సంఖ్యలో జవాన్లు ప్రాణాలు కోల్పోవడంతో ప్రతిష్టంభన నెలకొంది. 

దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను చల్లార్చే దిశగా వివిధ స్థాయిల్లో అధికారులు సంప్రదింపులు ప్రారంభించారు. రాజకీయ, దౌత్య, సైనిక పరమైన చర్చలు జరుగుతున్నాయి. 12వ దఫా కార్ప్స్‌ కమాండర్‌ స్థాయి చర్చలు ఈ ఏడాది జూలై 31న జరిగాయి. ఈ చర్చల్లో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం గోగ్రా నుంచి తమ బలగాల ఉపసంహరణ ప్రక్రియను భారత్, చైనా పూర్తి చేశాయి.

ఇరు దేశాల నడుమ సంబంధ బాంధవ్యాలు మెరుగుపడాలంటే డెస్పాంగ్‌తో సహా అన్ని వివాదాస్పద ప్రాంతాలపై ఒక ఒప్పందానికి రావాలని భారత్‌ స్పష్టం చేసింది.  ఇటీవల చైనా సైన్యం వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ)ను అతిక్రమించి ఉత్తరాఖండ్‌లోని బారాహోతి సెక్టార్, అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తవాంగ్‌ సెక్టార్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించింది. ఇరు దేశాల అధికారులు జోక్యం చేసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఈ నేపథ్యంలో 13వ దఫా చర్చలు సాఫీగా సాగడం విశేషం.