ఆధునిక మహిళ పిల్లలు కాదు,  ఒంటరి జీవితం కోరుకొంటుంది

భారతీయ సమాజంపై పెరిగిపోతున్న పాశ్చాత్య ప్రభావం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ ఆధునిక భారతీయ మహిళలు ఒంటరిగా ఉండాలని కోరుకుంటున్నారని, వివాహం తర్వాత కూడా బిడ్డలకు జన్మనివ్వడానికి ఇష్టపడటం లేదని, సరోగసీ ద్వారా పిల్లలను కోరుకుంటున్నారని కర్ణాటక ఆరోగ్య మంత్రి డా. కె సుధాకర్ విచారం  చేశారు.

“ఈ రోజు, నేను ఈ విషయం చెబుతున్నందుకు క్షమించండి.  భారతదేశంలో చాలా మంది ఆధునిక మహిళలు ఒంటరిగా  ఉండాలనుకుంటున్నారు. వారు వివాహం చేసుకున్నప్పటికీ, బిడ్డలకు  జన్మనివ్వడానికి ఇష్టపడటం లేదు. వారికి సరోగసీ కావాలి” అని తెలిపారు. కాబట్టి మన ఆలోచనలో ఒక నమూనా మార్పు కనిపిస్తున్నది. ఇది మంచిది కాదని  జాతీయ మానసిక ఆరోగ్యం, న్యూరోలాజికల్ సైన్సెస్ (నిమ్‌హాన్స్‌  ) సంస్థలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ స్పష్టం చేసారు.  

భారతీయ సమాజంపై “పాశ్చాత్య ప్రభావం” గురించి విచారం వ్యక్తం చేస్తూ, ప్రజలు తమ తల్లిదండ్రులను తమతో ఉండనివ్వడానికి ప్రజలు సుముఖంగా ఉండటం లేదని గుర్తు చేశారు. భారతదేశంలో మానసిక ఆరోగ్యం గురించి సుధాకర్ మాట్లాడుతూ, ప్రతి ఏడవ భారతీయుడు ఏదో ఒక రకమైన మానసిక సమస్యను కలిగి ఉంటాడని, ఇది తేలికపాటి, మితమైన, తీవ్రమైనది కావచ్చు అని తెలిపారు.

అయితే, ఒత్తిడి నిర్వహణ ఒక కళ అని, దాని గురించి భారతీయులు ప్రత్యేకంగా నేర్చుకోవలసిన అవసరం లేదని చెప్పారు. దానిని ఎలా నిర్వహించాలో ప్రపంచానికి బోధించాలని సూచించారు. “ఎందుకంటే యోగా, ధ్యానం, ప్రాణాయామం అనేవి మన పూర్వీకులు వేల సంవత్సరాల క్రితం ప్రపంచానికి బోధించిన అద్భుతమైన సాధనాలు” అని ఆయన పేర్కొన్నారు.

కరోనా, మానసిక ఆరోగ్యం గురించి ప్రస్తావిస్తూ బంధువులు తమ దగ్గరి,  ప్రియమైనవారి శరీరాలను తాకలేకపోయారని, ఇది వారికి మానసిక వేదన కలిగించిందని సుధాకర్ చెప్పారు. కరోనా మహమ్మారి రోగులకు కర్ణాటక ప్రభుత్వం కౌన్సిలింగ్ ప్రారంభించిందని చెబుతూ ఇప్పటి వరకు 24 లక్షల మంది కరోనా రోగులకు కౌన్సిలింగ్ చేసిన్నట్లు తెలిపారు. దేశంలో మరే రాష్ట్రంలో ఆ విధంగా చేస్తున్నట్లు తనకు తెలియదని తెలిపారు.

నిమ్‌హాన్స్‌ సంస్థ తన డిజిటల్ ప్లాట్‌ఫామ్ నుండి ప్రజలకు కౌన్సెలింగ్ ఇస్తోందని,  టెలి మెడిసిన్ అందిస్తున్నదని అంటూ మంత్రి అభినందించారు. కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియాకు కూడా సుధాకర్ కృతజ్ఞతలు  తెలుపుతూ సెప్టెంబర్ నుండి ప్రతి నెలా 1.5 కోట్ల కరోనా టీకాలను కర్ణాటకకు ఇస్తుండడంతో రాష్ట్రంలో టీకాల కవరేజీని పెంచిందని తెలిపారు.