
దేశంలో ఇంధనాలపై పరోక్ష పన్నులను విపరీతంగా పెంచడం వల్ల ద్రవ్యోల్బణంపై పడుతున్న దుష్ప్రభావంపై రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంతదాస్ మరోసారి ఆందోళన వ్యక్తం చేశారు. క్రమేపీ పరోక్ష పన్నుల్ని తగ్గించడం ద్వారా ద్రవ్యోల్బణంపై ఒత్తిడిని తగ్గించవచ్చని ఆర్బీఐ గవర్నర్ సూచనాప్రాయంగా తెలిపారు. అయితే ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నదని స్పష్టం చేశారు.
ఇంధనాలపై పరోక్ష పన్నులను భారీగా పెంచడంపై గతంలోనే ఆందోళన వ్యక్తం చేసిన శక్తికాంతదాస్.. తాజాగా శుక్రవారం ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన ప్రకటనల సందర్భంగా రెండోసారి ఈ అంశాన్ని ప్రస్తావించారు. గతేడాది అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు గణనీయంగా తగ్గినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం పెట్రోలియం, డీజిల్ లాంటి ఇంధనాలపై సుంకాలను, సెస్సులను రికార్డు స్థాయికి పెంచి భారీగా ఆదాయాన్ని వసూలు చేసిన విషయం తెలిసిందే.
ధరల పెరుగుదల తర్వాత కూడా ప్రభుత్వం పన్నులను తగ్గించకపోవడంతో లీటర్ పెట్రోల్ కొనుగోలుకు భారతీయులు రూ.100కుపైగా చెల్లించాల్సి వస్తున్నది. డీజిల్ ధర కూడా మూడంకెలకు చేరువైంది. దీనిపై తమ ఆందోళనలను, సూచనలను ఎప్పటికప్పుడు కేంద్రానికి తెలియజేస్తున్నామని, దీనిపై ఆర్బీఐకి, ప్రభుత్వానికి మధ్య నిరంతరం సంప్రదింపులు జరుగుతున్నాయని తెలిపారు.
కాగా, డిజిటల్ లావాదేవీలకు ఊతమిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇమ్మీడియెట్ పేమెంట్ సర్వీస్ (ఐఎంపీఎస్) ద్వారా జరిగే ఒక్కో లావాదేవీ పరిమితిని రూ.5 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. ప్రస్తుతం ఇది రూ.2 లక్షలుగానే ఉన్నది. మూడు రోజులపాటు జరిగిన ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష శుక్రవారం ముగిసింది.
ఈ సమీక్ష అనంతరం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పాలసీ నిర్ణయాలను మీడియాకు వివరిస్తూ ఐఎంపీఎస్ పరిమితిని పెంచుతున్నట్లు చెప్పారు. ఆఫ్‌లైన్‌లోనూ రిటైల్ డిజిటల్ చెల్లింపులు కొనసాగేలా కృషి చేస్తున్నామన్నారు. ఇదిలావుంటే వరుసగా 8వసారి కీలక వడ్డీరేట్లను యథాతథంగానే ఉంచుతున్నట్లు దాస్ తెలిపారు.
రెపో 4 శాతం, రివర్స్ రెపో 3.35 శాతంగా ఉన్నది. మరోవైపు కరోనాతో వచ్చిపడిన ఆర్థిక ఇబ్బందుల మధ్య రాష్ర్టాలకు ఊరటనిస్తూ గతంలో కల్పించిన అన్ని రుణ సదుపాయాలను వచ్చే ఏడాది మార్చి ఆఖరుదాకా కొనసాగిస్తామని ఆర్బీఐ ఈ సందర్భంగా స్పష్టం చేసింది.
ఇమ్మీడియెట్ పేమెంట్ సర్వీస్ అనేది దేశంలో ఓ ఇన్‌స్టంట్ పేమెంట్ ఇంటర్-బ్యాంక్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ బదిలీ వ్యవస్థ. దీన్ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తుంది. ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ యాప్స్, బ్యాంక్ శాఖలు, ఏటీఎంలు, ఎస్‌ఎంఎస్, ఐవీఆర్‌ఎస్ ద్వారా ఐఎంపీఎస్ సేవలు నిరంతరం జరుగుతాయి. బ్యాంక్ సెలవు దినాల్లోనూ ఈ సర్వీస్ పనిచేస్తుంది.
More Stories
కేజ్రీవాల్ అధికారిక నివాసం `శీష్మహల్’ పై సివిసి దర్యాప్తు
తగ్గనున్న వంట నూనెల ధరలు
2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యం రెట్టింపు