రాష్ట్రాలకు రూ.40వేలకోట్ల జీఎస్టీ పరిహారం విడుదల

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు గురువారం జీఎస్టీ పరిహారాన్ని విడుదల చేసింది. జీఎస్టీ లోటును తీర్చేందుకు బ్యాక్‌ టూ బ్యాక్‌ రుణ సదుపాయం కింద రూ.40వేల కోట్లు పరిహారం విడుదల చేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 

ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు రూ.823.17 కోట్లు విడుదల చేయగా, తెలంగాణకు రూ.1,149.46 కోట్లు విడుదల చేసింది.  ప్రతి రెండు నెలలకోసారి విడుదల చేస్తున్న సాధారణ జీఎస్టీ పరిహారానికి ఇది అదనమని పేర్కొంది. ఐదు సంవత్సరాల సెక్యూరిటీతో కేంద్రం తీసుకున్న రుణం నుంచి ఈ నిధులను సమకూర్చింది.

తాజాగా విడుదల చేసిన పరిహారంతో కలిపి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం ఇప్పటి వరకు రూ.1.15లక్షల కోట్లకు విడుదల చేసింది. మంత్రిత్వ శాఖ ఇంతకు ముందు జూలై 15న రాష్ట్రాలకు రూ.75వేలకోట్లు కేటాయించింది.

43వ జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం అనంతరం కేంద్రం 2021-22 ఆర్థిక సంవత్సరానికి రూ.1.59లక్షల కోట్లు అప్పు తీసుకొని రాష్ట్రాలకు పరిహారం కిందట అందజేస్తున్నది.  అలాగే సెస్‌ కింద వసూలు అయిన రూ.లక్ష కోట్లును కూడా ఆయా రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇవ్వాల్సివుంది. 

దీంతో మొత్తం రూ. రూ.2.59 కోట్లు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం ఇవ్వాల్సి ఉంది. ఇందులో గత జులై 15న రూ.75 వేల కోట్లు విడుదల చేయగా ఇప్పుడు రూ.40 కోట్లు విడుదల చేసింది.