హెల్త్‌ఫైమీ యాప్ కు పుతిన్ అనుచరుడితో లింక్!

అంతర్జాతీయ పరిశోధనాత్మక జర్నలిస్టుల బృందం బయట పెట్టిన పండోరా పేపర్స్‌లో భారత్‌లోని అనేక కంపెనీలు పన్ను ఎగ్గొట్టే మార్గాలను ఎలా ఎంచుకున్నాయనే విషయాలు వెల్లడౌతున్నాయి. అందులో ఒకటి హెల్త్‌ఫైమీ అనే ఆరోగ్యానికి సంబంధించిన అన్‌లైన్‌ యాప్‌ కంపెనీ. 
 
హార్యానా మాజీ డిజిపి శ్రీనివాస్‌ వశిష్ట్‌ కుమారుడైన తుషార్‌ వశిష్ట్‌ హెల్త్‌ఫైమీ అనే కృత్రిమ మేధ ఆధారంగా పని చేసే యాప్‌ కంపెనీని భారత దేశంలో స్థాపించాడు. దీనితో రష్యా అధ్యక్షుడు పుతిన్ అనుచరుడితో లింక్ ఉన్నట్లు ఈ పత్రాలలో వెల్లడి కావడం కలకలం రేపుతున్నది. 
 
హెల్త్‌ఫైమీ వెల్‌నెస్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ అనే ఈ కంపెనీకి సింగపూర్‌ కేంద్రంగా ఉన్న తాను స్థాపించిన హెల్త్‌ఫైమీ ప్రయివేట్‌ లిమిటెడ్‌ అనే కంపెనీ మాతృసంస్థగా ఉంది. భారత దేశంలో స్థాపించిన కంపెనీలో తుషార్‌ వశిష్ట్‌కు 10 షేర్లు ఉండగా, సింగపూర్‌ కేంద్రంగా ఉన్న మాతృసంస్థకు 2,43,318 షేర్లు ఉన్నాయి. అంటే భారత్‌ దేశంలో స్థాపించిన సంస్థలో షేర్లన్నీ తుషార్‌ వశిష్ఠ్‌కు చెందినవే ఉన్నాయి. 
 
అయితే ఈ సింగపూర్‌ కేంద్రంగా ఉన్న తుషార్‌ వశిష్ట్‌ కంపెనీకి లాంగ్‌ కేపిటల్‌ ఫండ్‌ (ఎల్‌సిఎఫ్‌) 2017 -18 కాలంలో చెల్లించిన నాలుగు చెల్లింపులు అనుమానస్పదంగా ఉన్నాయని, నిబంధనలకు విరుద్దంగా ఈ చెల్లింపులు జరిగాయని ఆసియాసిటి మేనేజ్‌మెంట్‌ ట్రస్ట్‌ ప్రశ్నించినట్లు పండోరా పత్రాల్లో వెల్లడైంది. 
 
ఈ ట్రస్ట్‌ లాంగ్‌ కేపిటల్‌ ఫండ్‌కు ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్‌గా పని చేస్తోంది. ఈ లాంగ్‌ కేపిటల్‌ ఫండ్‌ అనేది రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు అనుచురుడిగా ఉన్న రాజకీయ నాయకుడు కిరిల్‌ అండ్రోసవ్‌కు సంబంధించినది. ఈ ఫండ్‌కు నిధులు బ్రిటీష్‌ వర్జీన్‌ ఐస్‌లాండ్స్‌లో ఉన్న పిహెచ్‌ లిమిటెడ్‌ ద్వారా, ఈ సంస్థకు నిధులు సమోవాలో ఉన్న జిఎఐఎల్‌ సంస్థ నుండి, మరలా ఈ సంస్థకు నిధులు పూర్తిగా కిరిల్‌ అండ్రసోవ్‌కు చెందిన జి.ఐ ట్రస్ట్‌ నుండి అందాయి. 
 
ఈ విధంగా ఫండ్స్‌ దుర్వినియోగమయి రష్యాలోని ఒక రాజకీయ నాయకుడి ఆధీనంలో ఉన్న సంస్థ నుంచి సింగపూర్‌లో తుషార్‌ వశిష్ట్‌కు చెందిన హెల్త్‌ఫైమీ ప్రయివేట్‌ లిమిటెడ్‌లోకి వచ్చాయి.  2018లో హెల్త్‌ఫైమీ వెల్‌నెస్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ కంపెనీని స్థాపించిన తుషార్‌ వశిష్ట్‌ అప్పటికే తాను డైరెక్టర్‌గా, షేర్‌ హోల్డర్‌గా ఉన్న సింగపూర్‌ కేంద్రంగా ఉన్న హెల్త్‌ఫైమీ ప్రయివేట్‌ లిమిటెడ్‌ గురించి భారత సంస్థ డైరెక్టర్ల ఎటువంటి సమాచారం ఇవ్వలేదు 
 
కానీ భారత కంపెనీ రిజిష్ట్రేషన్‌ చట్టం ప్రకారం ప్రతి ఆర్ధిక సంవత్సరం మొదటి బోర్డు మీటింగ్‌లో సంస్థ ప్రమోటర్‌గా ఉన్న వారు ఏదైనా ఇతర సంస్థల్లో సభ్యులుగా ఉంటే కచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ తుషార్‌ వశిష్ట్‌ ఆ పని చేయలేదు.