కేసీఆర్ దళితుల ద్రోహి… వివేక్ ఆరోపణ

ఈటల రాజేందర్ విజయం కోసం దళితులంతా కృషి చేయాలని పిలుపిస్తూ కేసీఆర్ దళితుల ద్రోషి అని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ జి వివేక్ వెంకటస్వామి ధ్వజమెత్తారు.  జమ్మికుంటలో జరుగుతున్న బీజేపీ ఎస్సీ మోర్చా సమావేశంలో పాల్గొంటూ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్లుగా తన కుటుంబంలోని ఆరుగురికి అవకాశం ఇప్పించిన కేసీఆర్.. ఒక్క దళితుడికి కూడా ఇప్పించలేదని ఆయన మండిపడ్డారు.

కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ 12 మంది దళితులను కేబినెట్‎లోకి తీసుకున్నారు. బీజేపీ ప్రభుత్వం దళిత వ్యక్తిని రాష్ట్రపతిని చేసింది. కేసీఆర్ మాత్రం ఒకే దళిత వ్యక్తిని మాత్రమే రాష్ట్ర  కేబినెట్‎లోకి తీసుకున్నారని ఆయన గుర్తు చేశారు. అయితే తన కుటుంబం నుంచి కొడుకు, అల్లుడు సహా ఆరుగురు బంధువులకు కేబినెట్ హోదా ఇచ్చారని తెలిపారు. 

దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని మాట తప్పిన కేసీఆర్.. కనీసం తన తర్వాతైనా దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పడం లేదని ధ్వజమెత్తారు. మూడెకరాలు ఇస్తానని కేసీఆర్ చెప్పినప్పుడు ఐదు లక్షలకు ఎకరా కొనిస్తానన్నాడని ఎద్దేవా చేశారు. రూ  50 వేల కోట్లతో భూమి కొనిస్తానని అబద్ధాలు చెప్పాడని విమర్శించారు. 

దళితుల్లో ఎక్కువగా కౌలు రైతులే ఉంటారని, కానీ రైతుబంధు కౌలు రైతులకు  ఇవ్వడం లేదని వివేక్ ధ్వజమెత్తారు. కాళేశ్వరం బ్యాక్ వాటర్‎లో పంట నష్టపోయిన రైతులతో మాట్లాడానని పేర్కొంటూ  వాళ్లంతా కౌలురైతులే కాగా, దళిత కౌలు రైతులకు ఎందుకు రైతుబంధు ఇవ్వరని ఆయన ప్రశ్నించాను. 

కేసీఆర్ ఎప్పటికీ దళితులకు వ్యతిరేక కార్యక్రమాల గురించే ఆలోచిస్తారని విమర్శించారు. అప్పుడే మూడెకరాల భూమి ఇచ్చి ఉంటే వాటి విలువ రూ 50 లక్షలు ఉండేదని వివేక్ చెప్పారు. డబుల్ బెడ్ రూం ఇస్తే దాని విలువ రూ  15 లక్షలు ఉండేది. కానీ, ఈటలను ఓడించేందుకు మాత్రమే దళితులను మభ్యపెట్టేందుకు మరోసారి మోసం చేయడానికి దళితబంధు ప్రకటించారని ఆరోపించారు. 

పదిలక్షలు డబ్బులు వేసినట్లే వేసి… అకౌంట్లు ఫ్రీజ్ చేశారని గుర్తు చేశారు. మన ఓట్ల కోసమే కేసీఆర్ ఇలాంటివన్నీ చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈటల రాజేందర్‎ను గెలిపిస్తే.. సీఎం దిగివచ్చి దళితులందరికీ మూడెకరాల భూమి ఇస్తాడని స్పష్టం చేశారు.  అబద్ధాల ముఖ్యమంత్రి  ఉప ఎన్నికల్లో మాయమాటలు చెప్పి.. ఎన్నికలయ్యాక మర్చిపోతాడని పేర్కొన్నారు. ఇద్దరు దళిత ఉప ముఖ్యమంత్రులు ఉన్నప్పటికీ పక్కన పెట్టారని వివేక్ వెంకటస్వామి తెలిపారు.

కాగా, రూ 10 లక్షలు కాదు.. పది కోట్లు ఇచ్చినా టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసేది లేదని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ మహిళా నాయకురాలు బోడిగె శోభ స్పష్టం చేశారు. తానే కాదు.. తమ దళిత జాతి ఈటల రాజేందర్ కు మోసం చేయదని, ఆయనకే అండగా ఉంటామని ఆమె తేల్చి చెప్పారు.  తమది జాంబవంతుని జాతి అని ఆమె గుర్తు చేశారు. సత్యహరిశ్చంద్రుని జాతి అని ఆమె పేర్కొన్నారు. ఇస్తానన్న పదిలక్షలు ఇవ్వకపోతే కేసీఆర్ ను నిద్రపోనీయమని స్పష్టం చేస్తూ అందుకే ఈటలను గెలిపిస్తే పదిలక్షలు ఇచ్చేదాకా వదిలిపెట్టకుండా పోరాడుతాడని ఆమె తెలిపారు.