హెటిరో డ్రగ్స్, ల్యాబ్స్‌ల్లో ఐటీ దాడులు

హెటిరో డ్రగ్స్, హెటిరో ల్యాబ్స్‌ల్లో  ఐటీ సోదాలు మూడవ రోజు కొనసాగుతున్నాయి. సనత్‌నగర్‌లోని హెటిరో డ్రగ్స్, హెటిరో ల్యాబ్స్ ప్రధాన కార్యాలయం నుండి తెల్లవారుజామున మూడు గంటలకు ఐటీ బృందాలు వెళ్ళిపోయాయి. తిరిగి ఉదయం ఎనిమిది గంటలకు ప్రధాన కార్యాలయానికి వచ్చి సోదాలు చేపట్టారు. 
 
హెటిరో డ్రగ్స్, హెటిరో ల్యాబ్స్ ప్రధాన కార్యాలయాల్లో మూడవ రోజు సోదాలను ఐటీ టీమ్‌లు మొదలుపెట్టాయి. మరోవైపు హెటిరో డైరెక్టర్లు, సీఈఓల ఇళ్ళలో  సోదాలు ముగిశాయి. కార్పొరేట్ కార్యాలయంతోపాటు ఉత్పత్తి కేంద్రాల్లోనూ 20 బృందాలుగా ఏర్పడి అధికారులు సోదాలు నిర్వహించారు.  సోదాల్లో రూ 100 కోట్ల మేరకు భారీ నగదును ఐటీ టీమ్‌లు స్వాధీనం చేసుకున్నాయి. ఈ నగదుకు సంబంధించిన వివరాలను ఐటీ అధికారులు సేకరిస్తున్నారు.  
 
అంత భారీ నగదు ఉండటం వెనుక ఉన్న కారణాలను అధికారులు ఆరా తీస్తున్నారు. నగదు ఎక్కడి నుండి తీసుకువచ్చారు…ఎవరికి సంబంధించిన నగదు.. కంపెనీ లావాదేవీలకు చెందినదా లేక ఏదైనా బ్యాంకు లావాదేవీలకు చెందినదా అన్న వివరాలు ఇన్‌కం ట్యాక్స్ అధికారులు తెలుసుకుంటున్నారు. 
శ్రీకృష్ణ జ్యువెలర్స్‌ పై ఈడీ దాడులు
 
కాగా, భారీ బంగారం కుంభకోణం కేసులో ఈడీ దర్యాప్తు వేగవంతం చేసింది. మనీలాండరింగ్‌ ఆరోపణలపై డీఆర్‌ఐ 2019 కేసు ఆధారంగా హైదరాబాద్‌లో గుర్తింపు పొందిన శ్రీ కృష్ణ జ్యువెలర్స్‌ మీద ఈడీ దాడులు చేస్తోంది. బంగారం దిగుమతి విషయంలో అక్రమాలకు పాల్పడినట్టు 2019 డీఆర్‌ఐ కేసు ఆధారంగా ఈ సోదాలు జరుపుతోంది. 
 
శ్రీ కృష్ణ జ్యువెలర్స్ ఎండీ ప్రదీప్ కుమార్, ఆయన కుమారుడు సాయి చరణ్‌ను గతంలోనే డీఆర్‌ఐ అధికారులు అరెస్టు చేశారు.  రావిరాల జెమ్స్ అండ్ జ్యువెల్లెర్స్ పార్కులో ఉన్న శ్రీ కృష్ణ జ్యువెలర్స్‌లో భారీ కుంభకోనం జరిగినట్టు ఈడీ గుర్తించింది. విదేశాల నుంచి అక్రమంగా బంగారం కొనుగోలు చేయడంతోపాటు, 1100 కిలోల బంగారాన్ని శ్రీ కృష్ణ జ్యువెలర్స్ డైవర్ట్ చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి.
అంతేగాక కోట్లాది రూపాయల పన్నులు ఎగ్గొట్టినట్లు గుర్తించారు. ఆభరణాల ఎగుమతుల్లో సైతం స్కామ్ చేసినట్టు గుర్తించారు. ఆభరణాల్లో పెట్టిన వజ్ర వైడూర్యాలకు సంబంధించి కూడా సరైన లెక్కలు చూపకపోవడంతో నగరంలో శ్రీ కృష్ణ జ్యువెలర్స్‌కి చెందిన షోరూంలు అన్నింటిలో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. ఇక దేశవ్యాప్తంగా శ్రీకృష్ణ జ్యువెలర్స్‌ 35 షోరూంలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.