అయోధ్యకు ఉగ్రముప్పు…. ముందు జాగ్రత్తగా భారీ ట్ర‌క్ స్కాన‌ర్‌

అయోధ్యలో శరవేగంతో భారీ ఎత్తున జరుగుతున్న రామాలయం నిర్మాణం పనులకు ఉగ్రవాద ముప్పు ఉన్నదని నిఘా సంస్థలు హెచ్చరిస్తున్న దృష్ట్యా ఓ భారీ ట్రక్ స్కాన‌ర్‌ను విదేశాల నుంచి ర‌ప్పిస్తున్నారు.ఆలయ నిర్మాణం కోసం సామ‌గ్రిని మోసుకొచ్చే ట్ర‌క్‌ల‌ను పూర్తిగా స్కాన్ చేయ‌డానికి వీలుగా ఈ స్కాన‌ర్‌ను ఏర్పాటు చేయ‌నున్నారు. 

సిమెంట్ నుంచి మార్బుల్స్ వ‌ర‌కూ వివిధ నిర్మాణ సామ‌గ్రిని మోసుకొచ్చే ట్ర‌క్‌ల‌ను ఉగ్ర‌వాదులు ల‌క్ష్యంగా చేసుకొని పేలుడు ప‌దార్థాలు అమ‌ర్చే ప్ర‌మాదం ఉండ‌టంతో ఈ ముందు జాగ్ర‌త్త తీసుకుంటున్నారు. విదేశాల నుంచి వ‌చ్చే ఈ ట్ర‌క్ స్కాన‌ర్ ఓ భారీ ట్ర‌క్‌ను కూడా కేవ‌లం రెండే నిమిషాల్లో స్కాన్ చేస్తుంది.

విదేశాల నుంచి వ‌చ్చే ఈ స్కాన‌ర్ ఒక్కోదానికి సుమారు రూ.40 ల‌క్ష‌ల నుంచి రూ.50 ల‌క్ష‌ల వ‌ర‌కూ ఉంటుంద‌ని ఓ అధికారి వెల్ల‌డించారు. ఇప్ప‌టికే దీని కొనుగోలు కోసం వివిధ విదేశీ కంపెనీల‌తో చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ఈ మ‌ధ్యే అటారీలోని ఇండియా, పాకిస్థాన్ స‌రిహ‌ద్దులోనూ ఇలాంటి స్కాన‌ర్‌ను ఏర్పాటు చేశారు. 

ఈ స్కాన‌ర్ ద్వారా స్మ‌గ్లింగ్ లేదా ఇత‌ర పేలుడు ప‌దార్థాల ర‌వాణాకు అడ్డుక‌ట్ట వేయ‌వ‌చ్చు. అయోధ్య మందిర భ‌ద్ర‌త‌లో పాలుపంచుకుంటున్న యూపీ పోలీసుల‌కు మ‌రో ఆరేడు నెల‌ల్లో ఈ స్కాన‌ర్ ఇవ్వ‌నున్న‌ట్లు ట్ర‌స్ట్ అధికారులు తెలిపారు. ఇప్ప‌టికే ఆల‌యానికి సంబంధించిన పునాది నిర్మాణ ప‌నులు పూర్త‌య్యాయి. 2023 చివ‌రిలోపు భ‌క్తుల‌కు అయోధ్య రాముడి ద‌ర్శ‌న‌భాగ్యం క‌ల్పించాల‌న్న ఉద్దేశంతో రామ జ‌న్మ‌భూమి ట్ర‌స్ట్ ఆల‌య ప‌నుల వేగం పెంచింది.