సరిహద్దుల్లో పాక్ ఆయుధాలు, డ్రగ్స్ స్వాధీనం

జమ్మూలోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆయుధాలు పాక్‌ నుంచి డ్రోన్‌ ద్వారా జారవిడిచినట్లుగా భావిస్తున్నారు. ఇందులో ఏకే 47 రైఫిల్‌, మూడు మ్యాగజైన్లు, 30 బుల్లెట్లు, టెలిస్కోప్‌ ఉన్నట్లు అధికారులు తెలిపారు. శనివారం అర్ధరాత్రి అంతర్జాతీయ సరిహద్దు సమీపంలోని పహాలెన్ మండలం సౌజన్‌ గ్రామం వద్ద ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

పాక్‌ వైపు నుంచి వచ్చిన డ్రోన్‌, వస్తువులు జారవిడవడాన్ని గమనించిన ఓ గ్రామస్తుడు పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించినట్లు అధికారులు చెప్పారు. ఆపరేషన్‌ సమయంలో వైరస్‌తో కట్టిన పసుపు రంగు ప్యాకెట్‌ను గుర్తించామని, ఇందులో మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

ఘటనపై కేసు నమోదు చేసి.. వాటిని సేకరించేందుకు వచ్చిన వ్యక్తుల కోసం ఆరా తీస్తున్నారు. గత సంవత్సర కాలంగా పాక్‌ వైపు నుంచి భారత్‌లోకి డ్రోన్‌ కార్యకలాపాలు పెరిగాయి. ఇది భద్రతా దళాలకు పెద్ద సవాల్‌గా మారింది.

గతేడాది ఏడాది కాలంలో రెండు డ్రోన్లను వేర్వేరు ప్రదేశాల్లో బలగాలు కూల్చి వేయగా.. పెద్ద ఎత్తున రైఫిల్స్‌, పేలుడు పదార్థాలు, బాంబులు, మాదక ద్రవ్యాలతో పాటు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి. ఈ ఏడాది జూన్‌లో జమ్మూలో ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ స్టేషన్‌పై దాడి అనంతరం సరిహద్దులో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

గత సంవత్సర కాలంగా పాకిస్థాన్ నుంచి డ్రోన్ కార్యక్రమాలు ఎక్కువయ్యాయి. ఇది సరిహద్దు రక్షక బలగాలకు ఓ సవాలుగా మారింది. సంవత్సరకాలంలో సరిహద్దు భద్రతా బలగాలు వేర్వేరు ప్రాంతాల్లో రెండు డ్రోన్లను పడగొట్టి, పెద్ద ఎత్తున ఆయుధ సరకును స్వాధీనం చేసుకున్నారు. 

వారు స్వాధీనం చేసుకున్న వాటిలో రైఫిళ్లు, ఐఇడి, స్టిక్కీ బాంబులు, మాదకద్రవ్యాలు వంటివి ఉన్నాయి. ఇదిలావుండగా పాకిస్థాన్ డ్రోన్ల ద్వారా జమ్మూలోని భారత వాయుసేన స్థావరంలో ఈ ఏడాది జూన్ నెలలో రెండు బాంబులను జారవిడిచాక సరిహద్దు వద్ద సెక్యూరిటీ గ్రిడ్‌ను మరింత తీవ్రతరం చేశారు.

రూ.25కోట్ల విలువైన డ్రగ్స్‌ స్వాధీనం

ఉత్తర కశ్మీర్‌ బారాముల్ల జిల్లాలోని ఉరి సెక్టార్‌లో నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వెంట రూ.25కోట్ల విలువైన మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఎస్‌ఎస్‌పీ రాయీస్‌ అహ్మద్‌ భట్ మాట్లాడుతూ బారాముల్ల సరిహద్దు సమీపంలో అనుమానాస్పద కదలికలను గమనించి, దళాలను అప్రమత్తం చేయగా, ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారని పేర్కొన్నారు. 

జమ్మూకశ్మీర్‌ సరిహద్దుల నుంచి అక్రమంగా డ్రగ్స్‌ను రవాణా చేసేందుకు చేసిన ప్రయత్నాలను జవాన్లు విఫలం చేశారని ఆయన తెలిపారు. సుమారు 25 నుంచి 30 కిలోల హెరాయిన్‌ను బలగాలు స్వాధీనం చేసుకొని పోలీసులకు అప్పగించారు. ఈ డ్రగ్స్‌ విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.25కోట్లు ఉంటుందని అంచనా. జిల్లాలో డ్రగ్స్‌ రవాణాపై దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.