కేంద్ర నిధుల తాకట్టుతో అప్పులకు జగన్ సిద్ధం!

రోజువారీ ఖర్చులకు సహితం అప్పు చేయక దీనావస్థలో రాష్ట్ర  ఆర్షిక పరిస్థితిని దిగజార్చిన వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తాజాగా అప్పులు కూడా ఎక్కడా పుట్టని పరిస్థితులలో వివిధ పథకాలకు కేంద్రం ఇచ్చే నిధులను చూపి, వాటిని తాకట్టు పెట్టి అప్పులు ఇవ్వమని బ్యాంకులను ప్రాధేయపడుతున్నది. ఈ తాకట్టు వ్యవహారం ఉన్నతాధికారులతో పాటు బ్యాంకు అధికారులను సహితం దిగ్బ్రాంతికి గురిచేస్తున్నది. 

‘‘రాష్ట్రానికి అప్పులివ్వండి. నిర్ణీత గడువులోగా రాష్ట్రం చెల్లించలేకపోతే, కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించి కేంద్రం ఇచ్చే నిధులు బ్యాంకుల ఖాతాల్లోనే ఉంటాయి కదా! వాటిని తనఖా పెట్టుకోండి’’ అంటూ సెప్టెంబరు 2వ తేదీన ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ బ్యాంకులకు లేఖ రాశారు. 

కేంద్ర పథకాల నిధులు తాకట్టు పెట్టుకుని రాష్ట్రానికి అప్పులివ్వమనే ప్రతిపాదన బహుశా దేశచరిత్రలోనే ఇదే మొదటిసారి కావచ్చు.  కేంద్రం చిన్నా పెద్దా పథకాలు అన్నీ కలుపుకొని దాదాపు వంద పథకాలకు నిధులు ఇస్తోంది. ఈ రకంగా రాష్ట్రానికి సంవత్సరానికి దాదాపు రూ.13,000 కోట్లు కేంద్రం నుంచి వస్తున్నాయి.

దీనికి రాష్ట్రం తన వాటాను (మ్యాచింగ్‌ గ్రాంట్‌) జత చేసి.. పథకాలను అమలు చేయాలి. రాష్ట్రం వాటా రూ.7-8వేల కోట్ల వరకు భరించాల్సి ఉంటుంది. అంటే… కేంద్రం నుంచి ఈ రెండేళ్లలో రూ.26,000 కోట్లు పథకాల కోసం వచ్చాయి. కానీ రెండేళ్లుగా ఆ నిధులను రాష్ట్రం కేంద్ర ప్రాయోజిత పథకాలకు వినియోగించలేదు. తన వాటాను జత చేయకపోగా, కేంద్రం ఇచ్చిన నిధులను సొంత అవసరాలకు వాడేసింది.

ఉదాహరణకు, రోడ్లు బాగుచేయడానికి(సీఆర్‌ఐఎఫ్‌), కార్మికులు కట్టిన బీమా డబ్బులు (ఈఎ్‌సఐ), ఉపాధి హామీ నిధులు, నేషనల్‌ హెల్త్‌ మిషన్‌(ఎన్‌హెచ్‌ఎం), హౌసింగ్‌ ఇలాంటి అనేక రంగాలకు చెందిన నిధులతోపాటు… గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు వేయడానికి  ఏఐఐబీ ఇచ్చిన సొమ్ములనూ పక్కదారి పట్టించారు. దీనివల్ల నష్టపోయిన వారి నుంచి కేంద్రానికి ఫిర్యాదులు అందాయి. 

దీనిపై కేంద్రం స్పందించి ప్రతీ కేంద్ర పథకానికి ప్రత్యేకంగా బ్యాంకు ఖాతా తెరవాలని, తామిచ్చే నిధులను అందులో జమ చేయడంతో పాటు, రాష్ట్ర మ్యాచింగ్‌ గ్రాంటును జమ చేయాలని స్పష్టం చేసింది. ఆ బ్యాంకు ఖాతా లాగిన్‌ వివరాలు తమకు సమర్పించాలని ఏడాది క్రితం రాష్ట్రానికి లేఖ రాసింది. కానీ, రాష్ట్రం ఆ లేఖను సీరియ్‌సగా తీసుకోలేదు. దీంతో 3 నెలల క్రితం మరోసారి కేంద్రం లేఖ రాసి 

సెప్టెంబరు ముగిసేలోగా బ్యాంకు ఖాతాలు కచ్చితంగా తెరవకాపోతే నిధులు నిలిపివేస్తామని కేంద్రం హెచ్చరించడంతో రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకర్లతో సంప్రదింపులు మొదలుపెట్టింది. ‘కేంద్రం ఇచ్చే నిధులు బ్యాంకు ఖాతాలో వేస్తాం. కానీ, రాష్ట్ర మ్యాచింగ్‌ గ్రాంటుని బ్యాంకులే భరించాలి. దానిని ప్రభుత్వానికి ఇచ్చిన అప్పుగా(ఓడీ) భావించాలి’ అనే వింత ప్రతిపాదన చేసింది. ఈ తిరకాసు లెక్కలు తమకెందుకంటూ బ్యాంకులు మౌనం వహించాయి.

దానితో తాకట్టు ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చారు. దీనిపై  ‘‘కేంద్ర ప్రాయోజిత పథకాల కోసం రాష్ట్రం ఇచ్చే మ్యాచింగ్‌ గ్యాంట్‌ను ఓడీ రూపంలో అప్పుగా ఇచ్చేందుకు నిబంధనలు అంగీకరించవు. ఓడీ అప్పుతో లింకు పెట్టకుండా ఖాతాలు తెరిచే విషయమై స్థానిక ట్రెజరీ బ్రాంచులను సంప్రదించవచ్చు’’ అంటూ లీడ్ బ్యాంకు ఘాటుగా స్పందించింది.

కేంద్ర మార్గదర్శకాల ప్రకారం వంద బ్యాంకు ఖాతాలు తెరవాలి. అలా తెరిస్తే… నిధులు మళ్లించడం అసాధ్యం కాబట్టి ఇక్కడా కొంత తెలివి ప్రదర్శించారు. ఆ 100 పథకాలను 5 కార్పొరేషన్ల పరిధిలోకి తీసుకొచ్చి..5 ఖాతాలు తెరవాలని నిర్ణయించారు. ఆ మేరకు అంతర్గతంగా ఆదేశాలు జారీ చేశారు.