‘గులాబ్’ తుఫాన్ తో హైదరాబాద్‎లో హై అలర్ట్

‘గులాబ్’ తుఫాన్ తో హైదరాబాద్‎లో హై అలర్ట్
బంగాళాఖాతంలో ఏర్పడిన ‘గులాబ్’ తుఫాన్ ప్రభావంతో హైదరాబాద్‎లో పలుచోట్ల ఎడతెరపిలేని భారీ వర్షం కురుస్తోంది. సోమవారం తెల్లవారుజాము నుంచే నగరంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడుతున్నది.  
 
భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ప్రధాన రహదారులకు వరద పోటెత్తడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బంగాళా ళాఖాతంలో ఏర్పడిన ‘గులాబ్’ తుఫాన్ దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం హైఅలర్ట్ అయింది. నేడు, రేపు జీహెచ్ఎంసీ హైఅలర్ట్ ప్రకటించింది.
సోమవారం ఏడు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తాయంటూ హైదరాబాద్‌ వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. మరో 17 జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ను ప్రకటించింది. గులాబ్‌ ప్రభావం తెలంగాణలో సోమవారం ఒకరోజుకే పరిమితం కానున్నట్లు వాతావరణ శాఖ డైరెక్టర్‌ కె.నాగరత్న తెలిపారు.

గులాబ్‌ తుఫాను తీవ్ర‌ వాయుగుండంగా మారింది. అది తెలంగాణ మీదుగా కేంద్రీ కృతమై ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. వచ్చే 24 గంటల్లో గంటకు 30 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వెల్లడించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి రెడ్‌ అలర్ట్‌ జారీసింది.

తీవ్ర‌ వాయుగుండం, అల్పపీడన ప్రభావంతో రానున్న 24 గంటల్లో హైదరాబాద్‌ సహా పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. రానున్న 4 నుంచి 5 గంటల్లో హైదరాబాద్‌ లో అతిభారీ వర్షం కురుస్తుందని తెలిపింది. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

కాగా, రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉదని హెచ్చరించిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. విద్యుత్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ సీఎండీ అన్నమనేని గోపాల్ రావు ఆదేశించారు. 

ప్రజలంతా విద్యుత్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని, విద్యుత్ వైర్లు తెగిన, ఎలాంటి విద్యుత్ సంబంధిత సమస్య లకైనా సంబంధిత సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్‌రూమ్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 18004250028, 1912కి తెలియచేయాలని కోరారు.