నిరుద్యోగులతో బిజెపి మిలియన్‌ మార్చ్‌

దీపావళి నాటికి అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల చేయాలని, లేకపోతే నిరుద్యోగ యువతతో హైదరాబాద్‌లో మిలియన్‌ మార్చ్‌ నిర్వహిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ హెచ్చరించారు.  తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగమిస్తామన్న కేసీఆర్, ఏడేళ్లలో ఎలాంటి నోటిఫికేషన్లు ఇవ్వకపోవడంతో నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆయన చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండల కేంద్రం నుంచి ప్రారంభమై గన్నెవానిపల్లె, సేవాలాల్‌తండా మీదుగా తంగళ్లపల్లి మండలం అంకిరెడ్డిపల్లె నుంచి సారంపల్లి వరకు 14 కి.మీ మేర కొనసాగింది. కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా యాత్రలో పాల్గొన్నారు. 29వ రోజు పాదయాత్రలో యువకులు కదం తొక్కారు. ప్లకార్డులు పట్టుకుని నల్ల కండువాలతో నిరుద్యోగ నిరసన ర్యాలీ నిర్వహించారు.

అంకిరెడ్డిపల్లెలో జరిగిన బహిరంగ సభలో సంజయ్‌ మాట్లాడుతూ  నిరుద్యోగుల మిలియన్‌ మార్చ్‌తో ప్రభుత్వం కుప్పకూలడం ఖాయమని స్పష్టం చేశారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 2 లక్షలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయకుండా యువతను కేసీఆర్ మోసగించారని ఆయన  మండిపడ్డారు.

ఉపాధి హామీ పథకంలో 7,651 మంది ఫీల్డ్‌ అసిస్టెంట్లను తొలగించడంతో ఆర్థిక ఇబ్బందులు తాళలేక చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారని సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు.  వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.

ఉప ఎన్నికలు వస్తున్నాయంటే రేపే ఉద్యోగాల నోటిఫికేషన్‌ అంటూ కేసీఆర్‌ హామీలు ఇస్తాడని, ఎన్నికలయ్యాక ఫామ్‌హౌ్‌సలో నిద్రపోతాడని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ నిరుద్యోగికి రూ.లక్ష చొప్పున బాకీ ఉందనిసంజయ్ పేర్కొన్నారు. కేసీఆర్‌ కేవలం ఒక్క రైతుబంధు ఇస్తూ.. అన్ని సబ్సిడీ పథకాలను ఎత్తివేశారని ధ్వజమెత్తారు. 

ఇక గల్ఫ్‌ బాధితులను ప్రభుత్వం అసలు పట్టించుకోవడం లేదన్నారు. కేంద్రం నిధులు ఇస్తే.. వాడుకుంటూనే ఏం ఇవ్వడం లేదని కేసీఆర్‌ చెబుతున్నారని సంజయ్‌ ఆరోపించారు. కాగా, కేంద్రం చేత ధాన్యం కొనుగోళ్లు తానే చేయించానని చెబుతూ.. ఆ అంశంపై లీకులు ఇచ్చేందుకే సీఎం కేసీఆర్‌ ఢిల్లీ వెళ్లారని సంజయ్‌ విమర్శించారు. కేంద్రానికి లేఖ రాశాననీ సీఎం చెబుతారని, అయితే ఆ లేఖను విడుదల చేయాలని ఒక ప్రకటనలో సవాల్ చేశారు.

కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా మాట్లాడుతూ.. దేశంలో కొవిడ్‌ను సమర్థంగా ఎదుర్కొన్నామని, ప్రధాని మోదీ నేతృత్వంలో 50 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్‌ ఇచ్చామని చెప్పారు. తెలంగాణలో 2023లో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని భరోసా వ్యక్తం చేశారు. 

సంజయ్‌ పాదయాత్ర బండి ముందుకు వెళుతుంటే కేసీఆర్‌ కారు వెనక్కుపోతోందని బీజేపీ నేత, మాజీ ఎంపీ విజయశాంతి ధ్వజమెత్తారు. తెలంగాణ వస్తే నీళ్లు.. నిధులు.. నియామకాలు వస్తాయని అందరూ భావించారని, కానీ ఏడేళ్లలో అన్నీ సీఎం కేసీఆర్‌ కుటుంబానికే వచ్చాయని ఆమె ఆరోపించారు. అంకిరెడ్డిపల్లెలో జరిగిన సభలో ఆమెమాట్లాడుతూ  యువత, రైతులు తలచుకుంటే ప్రభుత్వాలు కూలిపోతాయని హెచ్చరించారు. సమస్యలు పరిష్కారం కావాలంటే ఆత్మహత్యలు కాదు.. కేసీఆర్‌పై తిరగబడాలని ఆమె పిలుపునిచ్చారు.

కాగా, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అక్టోబరు 2న హుజూరాబాద్‌ రానున్నారు. సంజయ్‌ పాదయాత్ర తొలిదశ ముగింపు సందర్భంగా హుజూరాబాద్‌లో 50 వేల మందితో రోడ్‌ షోకు ఏర్పాట్లు చేస్తున్నారు. షెడ్యూల్‌ ప్రకారం, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ కార్యక్రమానికి రావాల్సి ఉంది. అయితే,  బిజీ షెడ్యూల్‌ వల్ల ఆయన రాలేకపోతున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.