సార్క్ లో పాక్ తాలిబన్ చిచ్చు…. వార్షిక సమావేశం రద్దు

సార్క్‌ సమావేశానికి ఆఫ్ఘనిస్థాన్‌ తరఫున తాలిబన్ల ప్రతినిథిని అనుమతించాలని పాకిస్థాన్ పట్టుబట్టడంతో ఈ నెల 25న జరుగవలసిన సార్క్ విదేశాంగ మంత్రుల సమావేశంకు ఆటంకం ఏర్పడింది. పాకిస్థాన్ ప్రతిపాదనకు సభ్యదేశాలు ఒప్పుకోకపోవడంతో సార్క్‌ వార్షిక సమావేశం రద్దయింది. ఈ మేరకు నిర్వాహక దేశం నేపాల్‌ ప్రకటించింది. 

ప్రస్తుతం న్యూయార్క్ లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి 75వ వార్షిక ప్రతినిధి సమావేశాల సందర్భంగా ఈ సమావేశాన్ని జరపాలని ముందుగా నిర్ణయించారు.  ఆఫ్ఘనిస్థాన్ తరుపున తాలిబన్ ప్రతినిధిని అనుమతించాలని పాక్‌ ప్రభుత్వం పట్టుబట్టింది. అయితే ఇందుకు సభ్యదేశాలు అంగీకరించలేదు.

దీంతో తాలిబన్లను అనుమతించకపోతే.. గత అష్రఫ్‌ ఘనీ ప్రభుత్వానికి చెందిన ప్రతినిధులనును అనుమతించవద్దని పాక్‌ పట్టుబడింది. దీంతో పాక్‌ తీరుపై సభ్య దేశాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఈ పరిణామాల నేపథ్యంలో సార్క్ వార్షిక సమావేశం వాయిదా పడింది.

ఈ దక్షిణాసియా కూటమిలో బంగ్లాదేశ్‌, భూటాన్‌, ఇండియా, మాల్దీవులు, నేపాల్‌, పాకిస్థాన్‌, శ్రీలంక సభ్యదేశాలు ఉన్నాయి. 2007లోనే ఆఫ్ఘానిస్తాన్ కు సభ్యత్వం ఇచ్చారు.  ఆఫ్ఘనిస్థాన్‌ నుంచి ప్రాతినిథ్యం లేకుండా సమావేశం నిర్వహించాలని మెజారిటీ సభ్యదేశాలు నిర్ణయించాయి. అయితే దీనికి పాకిస్థాన్‌ ఒప్పుకోలేదని అధికారులు వెల్లడించారు.

ఇప్పటి వరకు తాలిబన్ల ప్రభుత్వాన్ని ఐక్యరాజ్యసమితి గాని, ప్రపంచ దేశాలు గాని గుర్తింపలేదు. అటువంటప్పుతూ వారి ప్రతినిధిని ఏ విధంగా ఆహ్వానిస్తామని సభ్యదేశాలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి.