వైద్యావసరాల కోసం జంతువులపై ప్రయోగాలను ఆపేయాలి 

మనుషుల వైద్యావసరాల కోసం జంతువులపై ప్రయోగాలను ఆపివేయాలని యూరోపియన్‌ యూనియన్‌ పార్లమెంటు చరిత్రాత్మక నిర్ణయం తీసుకొన్నది.జంతువులపై ప్రయోగాలను క్రమక్రమంగా దశలవారీగా తగ్గించాలని, ఔషధాల ట్రయల్స్‌కు కొత్త సాంకేతికతను అందిపుచ్చుకోవాలని ఈయూ పార్లమెంట్‌ ఎంపీలు ఓ తీర్మానంలో పేర్కొన్నారు. 

దీనికి కార్యాచరణను వేగవంతం చేయాలని, టైం లైన్‌ను ప్రకటించాలని సూచించారు. ‘కొన్ని ప్రయోగాలకు జంతువులు తప్పనిసరి. దానిని కాదనడం లేదు. కానీ జంతువులు అవసరం లేని సందర్భాల్లో కూడా వాటిపై ప్రయోగాలు జరుగుతున్నాయి. దీనిని అరికట్టాలి. తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప జంతువులపై ప్రయోగాలు జరగకుండా నిరోధించాలి’ అని అభిప్రాయపడ్డారు.

వైద్య విద్యార్థులకు జీవశాస్త్ర పాఠాల కోసం, శాస్త్రవేత్తల పరిశోధనలు, ప్రయోగాల కోసం ఏటా ప్రపంచవ్యాప్తంగా కోట్ల జంతువులను చంపేస్తున్నారు. మనుషుల స్వార్థం కోసం జంతువులను బలి చేయడంపై జంతు ప్రేమికులు చాలా కాలంగాతీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

యూరోపియన్‌ పార్లమెంట్‌ తీర్మానాన్ని జంతు ప్రేమికులు స్వాగతించారు. ‘మొత్తానికి మా డిమాండ్‌ ఇన్నాళ్లకు కార్యరూపం దాలుస్తున్నది. సాంకేతికత, అభివృద్ధి చెందుతున్న జీవ శాస్త్రం కేవలం మనుషుల ప్రాణాలకు సంబంధించిందే కాదు. జంతువులు, ప్రకృతిని రక్షించడానికి కూడా’ అని బ్రస్సెల్స్‌కు చెందిన ఓ ఎన్జీవో వ్యాఖ్యానించింది.

జంతువుల్లో అనుకొన్న ఫలితాలనిచ్చిన ఎన్నో టీకాలు, ఔషధాలు మనుషులపై ఫెయిల్‌ అయ్యాయి. శాస్త్రవేత్తల ప్రయోగాల్లో 95 శాతం  ఎలాంటి పురోగతి లేకుండా విఫలం అవుతున్నాయని ఓ అంచనా. సక్సెస్‌ అయిన వాటితో పోల్చితే ప్రభావవంతం కానీ, వ్యర్థమైన ప్రయోగాల వల్ల మానవాళికి లాభం కంటే నష్టమే ఎక్కువ అని బ్రిటిష్‌ మెడికల్‌ జర్నల్‌ గతంలో వ్యాఖ్యానించింది. 

గతంలో పెద్దగా సాంకేతికత లేని సమయంలో జంతువులపై ప్రయోగాలు నిర్వహించారు. ఇప్పుడు నేరుగా మానవ కణజాలాలపై పరిశోధనశాలల్లో ప్రయోగాలు నిర్వహించే సాంకేతిక అందుబాటులోకి వచ్చింది. చాలా ప్రయోగాలకు ఇలాంటి సాంకేతికత సరిపోతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.