బిజెపి అభ్యర్థి ప్రచారంలో కోల్‌క‌తా పోలీసుల నిఘా!

త‌న క‌ద‌లిక‌ల‌ను కోల్‌క‌తా పోలీసులు అధికార తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీకి తెలియ‌జేస్తున్నార‌ని భ‌వానీపూర్‌లో బీజేపీ అభ్య‌ర్థి ప్రియాంక టిబ్రేవాల్ ఆరోపించారు. ఈ మేర‌కు ఆమె త‌ర‌ఫు ఎన్నిక‌ల ఏజెంట్ భ‌వానీపూర్ ఎన్నిక‌ల రిట‌ర్నింగ్ అధికారికి లేఖ రాశారు. కొంత మంది కోల్‌క‌తా పోలీసులు సివిల్ డ్ర‌స్‌ల్లో త‌మ ప్ర‌చారంలో పాల్గొంటున్నార‌ని ఆరోపించారు. 

ఎప్ప‌టిక‌ప్పుడు త‌న క‌ద‌లిక‌ల‌ను ఫొటోలు తీసి తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ)కి పంపుతున్నార‌ని ఆరోపించారు. ప‌శ్చిమ‌బెంగాల్ సీఎం మ‌మ‌తా బెనర్జీ త‌న ఎన్నిక‌ల ప్ర‌చారంలో కోవిడ్‌-19 మార్గ‌ద‌ర్శ‌కాల‌ను పాటించ‌డం లేద‌ని బీజేపీ ఆరోపించింది. ఈ మేర‌కు మ‌మ‌తా బెన‌ర్జీపై ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేసింది. త‌న ఎన్నిక‌ల అఫిడ‌విట్‌లో స‌మాచారం దాచిపెట్టార‌ని ఇంత‌కుముందు దాఖ‌లు చేసిన ఫిర్యాదులో బీజేపీ పేర్కొంది.

ఇదిలా ఉంటే బీజేపీ అభ్య‌ర్థి ప్రియాంక టిబ్రేవాల్‌కు ఎన్నిక‌ల సంఘం (ఈసీ) నోటీస్ జారీ చేసింది. నామినేష‌న్ దాఖ‌లు స‌మ‌యంలో కోవిడ్‌-19 నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించి భారీగా మ‌ద్ద‌తుదారుల‌ను స‌మీక‌రించార‌న్న అభియోగంపై ఆమెకు నోటీసులిచ్చింది. టిబ్రేవాల్ కోవిడ్‌-19 నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించి, ఎటువంటి అనుమ‌తి లేకుండా 500 మందికి పైగా స‌మీక‌రించింద‌ని టీఎంసీ ఆరోప‌ణ‌.

టిబ్రేవాల్ ఈ ఆరోపణను ఖండిస్తూ  “నా నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్లినప్పుడు నేను భారీ సంఖ్యలో వ్యక్తులను కరోనా ప్రోటోకాల్ ను ఉల్లంఘిస్తూ  తీసుకున్నట్లు తృణమూల్ ఎన్నికల సంఘంకు ఫిర్యాదు చేసింది. నా సమాధానం ఏమైనప్పటికీ నేను ప్రత్యుత్తరం ఇస్తాను” అని తెలిపారు. 

“నా వాహనంలో సువేందు అధికారి ఒక్కరే ఉన్నారని  నేను చెప్పాలనుకుంటున్నాను. మరెవరూ లేరు. అర్జున్ సింగ్, దినేష్ త్రివేది తమ స్వంత వాహనాలాలో వచ్చారు. కాబట్టి నేను ఎన్నికల కోడ్‌ను ఎలా ఉల్లంఘించాను? నా వాహనంలో జెండా కూడా లేదు” అంటూ ఆమె స్పష్టం చేశారు.

“నేను ఎలాంటి జనసమూహాన్ని తీసుకు రాలేదు.  బైక్‌లు, నాలుగు చక్రాల వాహనాలపై ఎవరు రోడ్లపై ఉన్నారో చూడటం నా విధి కాదు. ఇది పోలీసుల, స్థానిక పరిపాలన పని” అని ఆమె తెలిపారు. సెప్టెంబర్ 30 న జరగాల్సిన భబానీపూర్ ఉప ఎన్నికలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, సిపిఎం అభ్యర్థి శ్రీజిబ్ బిశ్వాస్‌లకు వ్యతిరేకంగా టిబ్రేవాల్ పోటీ చేస్తున్నారు.