
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హయాంలో భారత దేశంలో మైనారిటీలు నూటికి నూరు శాతం సురక్షితం అని జాతీయ మైనారిటీల కమిషన్ (ఎన్‌సీఎం) చైర్‌పర్సన్ ఇక్బాల్ సింగ్ లాల్‌పుర భరోసా వ్యక్తం చేశారు. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మైనారిటీలపై విద్వేషపూరిత సంఘటనలు పెరిగాయని కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు, ప్రజా సంఘాల ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు.
మైనారిటీలలో అభద్రతా భావాన్ని రెచ్చగొట్టే తప్పుడు కథనాలను దూరం చేయడంపై ప్రధానంగా తాను దృష్టి పెడతానని తెలిపారు. ఇక్బాల్ సింగ్ లాల్‌పుర మంగళవారం ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, మోదీ ప్రభుత్వం ఏర్పాటవడానికి ముందు, తర్వాత పరిస్థితులను గమనించాలని సూచించారు.
గతంలో బీజేపీ ప్రభుత్వం లేని సమయంలో అలీగఢ్‌లో అల్లర్ల గురించి వినేవారమని తెలిపారు. బీజేపీ ప్రభుత్వాలు లేని ఇతర చోట్ల కూడా అల్లర్లు జరుగుతూ ఉండేవని పేర్కొన్నారు. తాను రాజ్యాంగ పదవిలో ఉన్నానని చెబుతూ ఈ పదవిలో ఉంటూ గణాంకాలను పరిశీలించినపుడు అల్లర్లు, హత్య, మూకదాడులు వంటి సంఘటనలు తగ్గినట్లు తెలిపారు.
అయినప్పటికీ కొన్ని సంఘటనలు జరుగుతున్నాయని, అందుకే జాతీయ మైనారిటీల కమిషన్ అవసరమని చెప్పారు. విద్వేషపూరిత సంఘటనలు పెరుగుతున్నాయనే ఆరోపణలపై స్పందిస్తూ, ఈ ఆరోపణలు తప్పు అని చెప్పారు. మైనారిటీల ప్రయోజనాలను కాపాడటమే ఎన్‌సీఎం చైర్‌పర్సన్‌గా తన కర్తవ్యమని స్పష్టం చేశారు.
వారికి ఎటువంటి అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అదే సమయంలో తప్పుడు కథనాల సృష్టి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మనమంతా భారతీయులమని, దేశాభివృద్ధి కోసం కృషి చేయాలని పేర్కొన్నారు. ప్రజలందరికీ రక్షణ లభించాలన్నారు. అందరికీ న్యాయం జరగాలని చెప్పారు. మనకు ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి కృషి చేద్దామని పిలుపునిచ్చారు.
More Stories
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు
జర్మనీ వైపు చూస్తున్న భారతీయ విద్యార్థులు