పునరుత్పాదక విద్యుత్ వినియోగంపై దృష్టిపెట్టండి

ప్రభుత్వ రంగ సంస్థలు, ఇతర పెద్ద సంస్థలు తమ విద్యుత్ అవసరాల కోసం సుస్థిరమైన పద్ధతులను అవలంబించాలని, ఇందుకు సౌరవిద్యుత్ వంటి పునరుత్పాదక విద్యుత్‌ ఉత్పత్తి వ్యవస్థలను ఏర్పాటుచేసుకోవడంపై దృష్టిపెట్టాలని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు సూచించారు. పరిశ్రమలు, విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ఇతర పనికేంద్రాల్లో పైకప్పుల్లో సౌరవిద్యుత్ పలకలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా తమ తమ అవసరాలకు అనుగుణంగా పునరుత్పాదక విద్యుత్ ను ఉత్పత్తి చేసుకోవాలని సూచించారు.

రాష్ట్రాలు, స్థానిక సంస్థలు తమ పరిధిలో నూతన భవనాల నిర్మాణంలో పైకప్పుల్లో సౌర పలకలతో విద్యుదుత్పత్తి, సౌరశక్తితో నీటిని వేడిచేసుకునే వ్యవస్థ, జల సంరక్షణకోసం ఇంకుడుగుంతల ఏర్పాటును తప్పనిసరి చేస్తూ చట్టాలు, నిబంధనల్లో మార్పులు తీసుకురావాలని ఉపరాష్ట్రపతి సూచించారు. భారతదేశంలో ఇటీవల 100 గిగావాట్ల పునరుత్పాదక విద్యుదుత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించుకోవడాన్ని ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి ప్రస్తావిస్తూ.. హర్షం వ్యక్తం చేశారు.

పుదుచ్చేరిలోని జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (జిప్మర్) లో నెలకొల్పిన 1.5 మెగావాట్ల సౌరవిద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాన్ని వెంకయ్యనాయుడు ఆదివారం జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన ప్రసంగించారు.

కరోనా మహమ్మారి సమయంలో మానవాళి నేర్చుకున్న పాఠాలను గుర్తుచేస్తూ.. భవంతులు, ఇతర నివాస ప్రాంతాల్లో కావాల్సినంత వెలుతురు, స్వచ్ఛమైన గాలి ప్రసరణ ఉండాలని ఆయన తెలిపారు.

 ‘స్వచ్ఛమైన గాలి, సూర్యరశ్మి, సహజ కీటక నాశినులు. మన పెద్దలకు ఈ విషయంపై స్పష్టమైన అవగాహన ఉంది. అందుకే ఇళ్ల నిర్మాణంలో, పనికేంద్రాల్లో వెలుతురు, గాలి విస్తృతంగా ఉండేలా చర్యలు తీసుకునేవారు. మనం జీవన విధానాలను మార్చుకుని గాలి, వెలుతురు చొరబడకుండా ఇళ్ల నిర్మాణం చేపట్టడం ద్వారానే అనారోగ్య సమస్యలు ప్రబలుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మన పెద్దలను అనుసరించిన పద్ధతులను పాటించాలి’ అని ఉపరాష్ట్రపతి సూచించారు.

జిప్మర్ వంటి వైద్య సంస్థలు కరోనా మహమ్మారి సమయంలో చేసిన కృషిని ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి అభినందించారు. ఈ కార్యక్రమంలో పుదుచ్చేరి లెఫ్ట్ నెంట్ గవర్నర్ డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి, శాసనసభ స్పీకర్ ఎంబలమ్ ఆర్ సెల్వమ్, జిప్మర్ సంచాలకుడు రాకేష్ అగర్వాల్  పాల్గొన్నారు.