కాశ్మీర్ లో వేర్పాటు వాదంకు కాంగ్రెస్ మాత్రమే కారణం!

జమ్మూ కాశ్మీర్ లో నెలకొన్న సంక్షోభంకు, ఇక్కడ వ్యాపించిన వేర్పాటు వాదానికి  కాంగ్రెస్ మాత్రమే కారణం అని బిజెపి స్పష్టం చేసింది. ఈ ప్రాంతంను ఆర్ధిక తిరోగమనం వైపుకు నెట్టుతూ, ఇక్కడ నెలకొన్న ఉమ్మడి సంస్కృతిని బిజెపి విచ్ఛిన్నం చేస్తున్నట్లు కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, గులాం నబి ఆజాద్ చేసిన విమర్శలను బిజెపి తీవ్రంగా తిప్పికోట్టింది. “జమ్మూ కాశ్మీర్ లో అవినీతి, తీవ్రవాదం, వేర్పాటువాదానికి మూలకారణం కాంగ్రెస్” అని బిజెపి సీనియర్ నాయకుడు, మాజీ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి కవిందర్ గుప్తా శ్రీనగర్‌లో విమర్శించారు.

“దేశంలో కాంగ్రెస్ పాలన హయాంలోనే కాశ్మీరీ పండిట్ల వలసలు జరిగాయి. జమ్మూకాశ్మీర్‌లో ప్రజల కష్టాలకు కాంగ్రెస్ బాధ్యత వహిస్తుంది, ఎందుకంటే కొందరు వలసల కారణంగా ఇబ్బందులను ఎదుర్కొంటే, మరొకొందరు ఈ ప్రాంతంలో కాంగ్రెస్ నడుపుతున్న దుర్మార్గమైన,  ఒడిదుడుకుల విధానాల వల్ల ఏర్పడిన తీవ్రవాదం కారణంగా పరీక్షను ఎదుర్కొన్నారు ”అని గుప్తా మండిపడ్డారు.

“1990ల ప్రారంభంలో కాంగ్రెస్ తన పాత్రను పరిపక్వంగా పోషించి ఉంటే, జమ్మూ కాశ్మీర్ పురోగతి శిఖరాగ్రంకు చేరుకొని ఇక్కడ పరిస్థితి భిన్నంగా ఉండేది” అని గుప్తా పేర్కొన్నారు. రాహుల్ గాంధీ బిజెపిపై నిరాధారమైన ఆరోపణలు చేసే ముందు కొంత  హోంవర్క్ చేసుకొని ఉండవలసింది అని హితవు చెప్పారు. ఎందుకంటే కాశ్మీర్‌లో గందరగోళంకు బాధ్యత కేవలం పండిత్  జవహర్‌లాల్ నెహ్రూ నుండి మొదలుకొని ఆయన పార్టీ నాయకత్వంపై ఉందని గుప్తా స్పష్టం చేశారు.

ఆర్టికల్ 370 ప్రకారం జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక హోదాను ఆమోదించడం ద్వారా , ఇక్కడ కాశ్మీఈ పండిట్ల ప్రవేశానికి నిశబధంగా  మద్దతు ఇవ్వడం ద్వారా  కాంగ్రెస్ సమాజాన్ని విభజించిందని ఆయన ధ్వజమెత్తారు.

హిందువులు, సిక్కులు లేదా ముస్లింలు కాశ్మీరీల గాయాలను నయం చేయడంలో నిర్మాణాత్మక పాత్ర పోషించడానికి బదులుగా, రాహుల్ సమాజంలోని వివిధ వర్గాల మధ్య ద్వేషాన్ని తిరిగి నాటడానికి దుష్ట బుద్ధితో జమ్మూకాశ్మీర్ కు రావడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. మునుపెన్నడూ లేని విధంగా శాంతి,  పురోగతిని సాధించడం ద్వారా జమ్మూ కాశ్మీర్ తిరిగి గత వైభవం నెలకొల్పేందుకు ఇప్పుడు ప్రయత్నం జరుగుతున్నదని ఆయన స్పష్టం చేశారు.