జీన్స్‌, స్లీవ్‌లెస్‌ టాప్‌లతో బ్రిటన్ ఎంపీలపై నిషేధం!

మహిళా ఎంపిల వస్త్రధారణపై బ్రిటన్‌ పార్లమెంట్‌ స్పీకర్‌ అల్టిమేటం జారీ చేశారు. జీన్స్‌, స్పోర్ట్స్‌వేర్‌, స్లీవ్‌లెస్‌ టాప్‌లు ధరించి మహిళా సభ్యులు హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌కు హాజరుకాకూడదని స్పీకర్‌ సర్‌ లిండ్సే హోలే హెచ్చరించారు.
 
వేసవి విరామం అనంతరం సోమవారం నుండి పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కామన్స్‌ కొన్ని నిబంధనలు జారీ చేశారు. కరోనా లాక్‌డౌన్‌లో వర్చువల్‌ సమావేశాల్లో పాల్గనే సమయంలో ఎంపిలకు ఎటువంటి నిబంధనలు విధించలేదని, అయితే పార్లమెంట్‌లో ప్రవర్తన, మర్యాద నియమాలు పాటించాల్సిందేనని స్పష్టం చేశారు.
 
ఎంపిలుగా మీ నియోజకవర్గాల, దేశానికి ప్రాణమైన పార్లమెంట్‌ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత మీపై వుందని, అందుకు అనుగుణంగానే వస్త్రధారణ ఉండాలని లిండ్సే తెలిపారు. అదే విధంగా సభలో చర్చ జరుగుతున్నప్పుడు సభ్యులు ఆసక్తితో వింటూ ఉండాలని, వార్త పత్రికలు, పుస్తకాలు చదవడం, మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు చూస్తూ ఉండడం చేయరాదని కూడా స్పీకర్ స్పష్టం చేశారు. 
 
జీన్స్‌, ఖాకీ రంగు వస్త్రాలు, సాధారణ ట్రౌజర్స్‌, స్లీవ్‌లెస్‌ టాప్‌లు, టీషర్ట్స్‌ పాలకుల వస్త్రధారణను సూచించవని, వాటిని ధరించకూడదని పేర్కొన్నారు. అలాగే పురుషులు టై, జాకెట్స్‌ ధరించడం తప్పనిసరని, అలాగే కాజువల్‌ షూస్‌ ధరించి సమావేశాలకు హాజరుకాకూడదని స్పష్టం చేశారు. 
 
పార్లమెంట్‌ సభ్యులుగా మీ దుస్తులు, భాష, ప్రవర్తన ఆ హోదాను ప్రతిబింబించేలా ఉండాలని హితవు చెప్పారు. అలాగే కామన్స్‌ చాంబర్‌లో పాడటం, చప్పట్లు కొట్టడం, నినాదాలు చేయడం వంటివి చేయకూడదని ఆ నిబంధనల్లో పేర్కొన్నారు. కాగా, గతేడాది డిసెంబర్‌లో కామన్స్‌లో జరిగిన కరొనపై చర్చా వేదికలో పాల్గొన్న మాజీ విదేశాంగ కార్యదర్శి జెర్మీ హంట్‌ వస్త్రధారణ స్మార్ట్‌గా లేదంటూ  విమర్శలు చెలరేగాయి.