బ్యాడ్మింటన్‌లో కృష్ణా నాగర్‌కు స్వర్ణం

టోక్యో పారా ఒలింపిక్స్‌లో భారత ఆటగాడు కృష్ణా నాగర్‌ బంగారు పతకం దక్కించుకుని, చరిత్ర సృష్టించారు. ఫైనల్ మ్యాచ్‌లో కృష్ణా నాగర్‌ 2-1 స్కోరుతో హాంకాంగ్ ఆటగాడు కై మాన్ చును ఓడించారు. టోక్యో పారాలింపిక్స్‌లో భారత్‌కు ఇది ఐదో బంగారు పతకం

హాంకాంగ్‌ ప్లేయర్‌ కైమన్‌ చూతో జరిగిన ఫైనల్‌లో 21-17, 16-21, 21-17తో విజయం సాధించాడు. దీంతో బ్యాడ్మింటన్‌లో బంగారు పతకం సాధించిన రెండో ప్లేయర్‌గా రికార్డు సాధించాడు. శనివారం జరిగిన ఎస్‌ఎల్‌ 3 విభాగంలో ప్రమోద్‌ భగత్‌ గోల్డ్‌ సాధించిన విషయం తెలిసిందే.

దీనికిముందు  పురుషుల సింగిల్స్ బ్యాడ్మింటన్ ఈవెంట్-4 లో నోయిడా(యూపీ)లోని గౌతమ్ బుద్ధ్ నగర్‌ జిల్లా మేజిస్ట్రేట్ సుహాస్ యతిరాజ్ రజత పతకం సాధించారు.  టైటిల్ మ్యాచ్‌లో సుహాస్ యతిరాజ్ 2-1 స్కోరుతో ఫ్రెంచ్ ఆటగాడు లుకాస్ మజూర్ చేతిలో ఓటమిపాలయ్యారు. ఫైనల్లో ఇద్దరు ఆటగాళ్ల మధ్య ఆసక్తికర పోరు సాగింది. 

కాగా బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్-4 కాంస్య పతకం మ్యాచ్‌లో భారత ఆటగాడు తరుణ్ ధిల్లాన్ ఓటమి పాలయ్యారు. 2-0 తేడాతో ఇండోనేషియాకు చెందిన ఫ్రెడ్డీ సెటివాన్ చేతిలో ఓటమి పాలయ్యారు. షూటింగ్ ఈవెంట్‌లో సిద్ధార్థ్ బాబు, దీపక్ సైనీ, అవనీ లేఖారా టీమ్ నిరాశపరిచింది.

పారాలింపిక్స్‌లో రజత పతకం సాధించిన సుహాస్‌ యతిరాజ్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని మోదీ, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌ ప్రశంసించారు. రజతం గెలవడమే సుహాస్‌ అంకితభావానికి నిదర్శనమని రాష్ట్రపతి కోవింద్‌ కొనియాడారు. ప్రభుత్వ విధులు నిర్వర్తిస్తూనే పతకం గెలిచాడని అభినందించారు.

‘ప్రపంచ నంబర్​.1 ఆటగాడికి గట్టి పోటీ ఇచ్చి రజత పతకం సాధించిన యతిరాజ్​కు అభినందనలు. కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తూనే స్పోర్ట్స్​పై దృష్టి పెట్టడం గర్వించదగ్గ విషయం. భవిష్యత్తులో మరింతగా రాణించాలి’ అని రాష్ట్రపతి రామ్‌నాథ్​ కోవింద్ ట్వీట్‌ చేశారు.