ఇన్ఫోసిస్ వెనుక దేశ వ్యతిరేక, తుక్డే-తుక్డే ముఠా?

భారత ప్రభుత్వం ఆర్ధిక మంత్రిత్వ శాఖ ఎంతో నమ్మకంతో అప్పచెప్పిన జిఎస్‌టి, ఆదాయపు పన్ను పోర్టల్స్‌  అభివృద్ధి చేయడంలో వెలుగులోకి వచ్చిన పలు లోపాలపై సర్వత్రా విమర్శలు వెలుగెత్తుతున్నాయి. ఈ పోర్తలను అభివృద్ధి చేసిన ప్రముఖ దేశీయ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ వ్యవహారశైలిపై ఈ సందర్భంగా పలు విమర్శలు చెలరేగుతున్నాయి.
 
తద్వారా దేశ వ్యతిరేక శక్తి ఎవరైనా భారతదేశ ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోందా అంటూ పాంచజన్య  వారపత్రిక విస్మయం వ్యక్తం చేసింది. బహుశా మొట్టమొదటి సారిగా ఒక ప్రముఖ పారిశ్రామిక సంస్థ యాజమాన్యంపై తీవ్రమైన అనుమానాలు వ్యక్తం చేస్తూ కవర్ పేజీ కధనం ప్రచురించింది. 
 
తాజా ఎడిషన్‌లో, పాంచజన్య ఇన్ఫోసిస్ ‘సాఖ్ ఔర్ అఘాత్’ (ఖ్యాతి, నష్టం) పై నాలుగు పేజీల ముఖపత్ర కధనాన్ని దాని వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి చిత్రంతో ప్రచురించింది. ఈ కథనంలో బెంగళూరుకు చెందిన ఇన్ఫోసిస్ కంపెనీ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ  దానిని ‘ఉంచి దుకాన్, ఫికా పక్వాన్’ (గొప్ప ఏడుపు, చిన్న ఉన్ని) గా అభివర్ణించింది.
 
ఈ కథనంలో ఈ పత్రికకు ఎటువంటి ఆధారాలు లేకపోయినప్పటికీ, “నక్సలైట్లు, వామపక్షవాదులు, తుక్డే-తుక్డే ముఠాలకు” సహాయం చేసినట్లు ఇన్ఫోసిస్ అనేక సార్లు ఆరోపణలకు గురయిన్నట్లు ప్రస్తావించింది. ఇన్ఫోసిస్ “తన విదేశీ ఖాతాదారులకు ఇదే విధమైన నీచమైన సేవను అందిస్తుందా?” అని కూడా ప్రశ్నించింది.   
ఇప్పటి వరకు అటువంటి  తీవ్రమైన ఆరోపణలు  వ్యక్తులు, నాయకులు, రాజకీయ సంబంధిత సంఘాలు, మీడియా లపై వస్తుండడం జరుగుతూ ఉంటుంది. కానీ ఒక ప్రముఖ కార్పొరేట్ సంస్థ, అది కూడా అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన ఐటి  సంస్థపై రావడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. 

ఇన్ఫోసిస్ అభివృద్ధి చేసిన ఈ పోర్టల్‌లలో క్రమం తప్పకుండా లోపాలు జరుగుతున్నాయని, ఫలితంగా పన్ను చెల్లింపుదారులు, పెట్టుబడిదారులకు ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొన్న ఈ కథనం “భారత ఆర్థిక వ్యవస్థపై పన్ను చెల్లింపుదారుల నమ్మకాన్ని తగ్గించింది” అంటూ ఆందోళన వ్యక్తం చేసింది.

భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ సాఫ్ట్‌వేర్ కంపెనీలలో ఒకటిగా ఉన్నందున ఇన్ఫోసిస్‌కు కీలకమైన వెబ్‌సైట్‌లు, పోర్టల్‌ల కోసం ప్రభుత్వ సంస్థలు, ఏజెన్సీలు ఒప్పందాలు ఇవ్వడానికి వెనుకాడవని ఆ కథనం పేర్కొంది.

“ఇన్ఫోసిస్ అభివృద్ధి చేసిన  జిఎస్‌టి,  ఆదాయ పన్ను రిటర్న్ పోర్టల్స్ రెండింటిలో లోపాల కారణంగా, పన్ను చెల్లింపుదారులకు దేశ ఆర్థిక వ్యవస్థపై విశ్వాసం దెబ్బతింది. ఇన్ఫోసిస్ ద్వారా ఏదైనా దేశ వ్యతిరేక శక్తి భారతదేశ ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తోందా, ”అని కథనం ఆశ్చర్యపోయింది.