తెలంగాణకు మొదటి ద్రోహి కేసీఆరే

తెలంగాణకు మొదటి ద్రోహి కేసీఆరేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మండిపడ్డారు.బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర శుక్రవారం వికారాబాద్‌ జిల్లా పూడూరు మండలంలో కొనసాగింది. ఇందులో భాగంగా మన్నెగూడ చౌరస్తాలో ఏర్పాటు చేసిన రోడ్‌ షోలో ఆయన ప్రసంగీస్తూ  ప్రజలను, ఎమ్మెల్యేలను, మంత్రులను కలిసేందుకు కేసీఆర్‌కు సమయం ఉండదని ఎద్దేవా చేశారు. 

ప్రధాని మోదీ మాత్రం దేశ ప్రజలందరినీ సమాన దృష్టితో చూస్తారని తెలిపారు. అందులో భాగంగా కేసీఆర్‌ ఎప్పుడు వెళ్లినా అపాయింట్‌మెంట్‌ ఇస్తారని చెప్పారు. ఇది ఆసరాగా చేసుకుని ప్రధాని తనను ప్రశంసించారని తన అనుకూల మీడియాలో ప్రచారం చేయించుకుంటారని ఎద్దేవా చేశారు.  

రాష్ట్రం ప్రభుత్వం చేస్తున్నదేమీ లేదని, కేంద్రం నుంచి వచ్చే నిధులను పథకాల పేర్లు మార్చి అమలు చేస్తున్నారని చెప్పారు. ఎన్నికల హామీలు అమలు చేయకుండా ప్రజలను కేసీఆర్‌ మోసం చేస్తున్నారని ఆరోపించారు. ప్రధాని మోదీని కలవడానికి కేసీఆర్‌ పడిగాపులు పడ్డారని ఎద్దేవా చేస్తూ ఢిల్లీ నుంచి రాగానే టీఆర్‌ఎస్‌, బీజేపీ ఒక్కటేనన్న భావన ప్రజల్లో కల్పించి లబ్ధి పొందడానికి కేసీఆర్‌ ప్రయత్నం చేస్తారని ధ్వజమెత్తారు.

తెలంగాణకు సీఎం కేసీఆర్‌ ద్రోహం చేస్తున్నారని సంజయ్‌ ఆరోపించారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా 575 టీఎంసీలు ఉంటే  కేసీఆర్‌ 299 టీఎంసీలకే అంగీకరించి రాష్ట్ర ప్రజల నోట్లో మట్ట్టి కొట్టారని ఆరోపించారు. నాడు చంద్రబాబుతో, ఆ తరువాత జగన్‌తో కేసీఆర్‌ కుమ్మక్కవడమే ఇందుకు కారణమని దుయ్యబట్టారు. 

కమీషన్ల కక్కుర్తితో.. పక్క రాష్ట్రాలు ప్రాజెక్టులు కడుతున్నా అభ్యంతరం చెప్పడంలేదని ఆరోపించారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ప్రశ్నించాల్సిన అపెక్స్‌ కౌన్సిల్‌, కేఆర్‌ఎంబీ సమావేశాలకు వెళ్లకుండా మొహం చాటేస్తున్నారని మండిపడ్డారు. సమావేశాన్ని కేసీఆర్‌ బహిష్కరిస్తే.. రాష్ట్ర ప్రజలు ఆయనను, ఆయన పార్టీని బహిష్కరిస్తారని హెచ్చరించారు.

బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మాట్లాడుతూ  తెలంగాణ రాష్ట్రానికి దళితుడిని తొలి ముఖ్యమంత్రిని చేస్తానన్న మాట నిలబెట్టుకోలేని కేసీఆర్‌.. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక కోసం దళితబంధు పేరుతో మరో పెద్ద మోసం చేస్తున్నారని ఆరోపించారు. పాదయాత్రలో బండి సంజయ్‌ను మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీ్‌పకుమార్‌ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.