తాలిబన్లు గెలిచారని భారత ముస్లింలు సంబరాలా!

ఆఫ్ఘానిస్తాన్ లో తాలిబన్లు తిరిగి అధికారమలోకి వచ్చారని భారత దేశంలోనే కొందరు ముస్లింలు సంబరాలు చేసుకొంటూ ఉండడంపై ప్రముఖ నటుడు నసీరుద్దీన్ షా విస్మయం వ్యక్తం చేశారు. ఇటీవల రికార్డు చేసిన తన వీడియోలో `హిందూస్థానీ ఇస్లాం’, ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో ఆచరిస్తున్న ఇస్లాంల మధ్య గల వ్యత్యాసాలను ప్రస్తావించారు.

ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లు అధికారంలోకి రావడం యావత్తు ప్రపంచానికి ఆందోళనకమైనప్పటికీ, భారతీయ ముస్లింలలోని కొన్ని వర్గాలు సంతోషంగా సంబరాలు చేసుకుంటుండటం తక్కువ ప్రమాదకరం కాదని హెచ్చరించారు. నసీరుద్దీన్ షా ఓ వీడియో సందేశంలో, ‘‘ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లు తిరిగి అధికారంలోకి రావడం యావత్తు ప్రపంచానికి ఆందోళనకరం అయినప్పటికీ, భారతీయ ముస్లింలలోని కొన్ని వర్గాలు సంబరాలు చేసుకుంటున్నారు. ఆటవికుల సంబరాలు తక్కువ ప్రమాదకరమేమీ కాదు’’ అని పేర్కొన్నారు.

తాలిబాన్ల పునరుజ్జీవనాన్ని జరుపుకుంటున్న వారు తమను తాము ప్రశ్నించుకోవాలని కోరారు, “వారు సంస్కరించిన ఆధునిక ఇస్లాం (జిద్దత్ పసంది ఆధునికత) కావాలనుకుంటున్నారా లేదా గత కొన్ని శతాబ్దాల పాత అనాగరికత (వైశిపాన్) తో జీవించాలని అనుకొంటున్నారా ట్లేచుకోవాలి” అని హితవు చెప్పారు. ఇస్లాంను సంస్కరించి, ఆధునికతకు మద్దతివ్వాలో, లేదంటే, ఆటవిక, అనాగరిక, క్రూరమైన సంప్రదాయాలు, విలువలతో కలిసి జీవించాలో భారతీయ ముస్లింలు తమను తాము ప్రశ్నించుకోవాలని సూచించారు. కచ్చితంగా తాలిబన్లు ఓ శాపం అని స్పష్టం చేశారు. 

ఈ సందర్భంగా ఆయన భారతీయ ముస్లింలు పాటించే ఇస్లాంను, ఇతర దేశాలవారు పాటించే ఇస్లాంను పోల్చి చెప్పారు. ‘హిందుస్థానీ ఇస్లాం’ ఎల్లప్పుడూ ప్రత్యేకమైనదని చెప్పారు. మనం గుర్తించలేనంతగా మార్పులు జరిగే సమయం రాకుండా అల్లా చూడాలని కోరారు. దేవునితో తన వ్యక్తిగత సంబంధాన్ని ప్రస్తావిస్తూ తనకు రాజకీయ మతం అవసరం లేదని స్పష్టం చేశారు.  “నేను భారతీయ ముస్లింని. మీర్జా గాలిబ్ చాలా సంవత్సరాల క్రితం చెప్పినట్లుగా, దేవునితో నా సంబంధం అనధికారికమైనది. నాకు రాజకీయ మతం అవసరం లేదు” అని ఆయన తేల్చి చెప్పారు.