ర‌క్ష‌ణ రంగంలో స్వయం స‌మృద్ధి దిశ‌గా భార‌త్

ర‌క్ష‌ణ రంగంలో స్వయం స‌మృద్ధి దిశ‌గా భార‌త్

ర‌క్ష‌ణ రంగంలో భార‌త్‌ స్వ‌యం స‌మృద్ధి సాధించడ‌మే ల‌క్ష్యంగా ప‌నిచేస్తున్నామ‌ని ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ తెలిపారు. ర‌క్ష‌ణ రంగంలో ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్‌ను బ‌లోపేతం చేయ‌డంతో పాటు ర‌క్ష‌ణ రంగ ఎగుమ‌తుల‌ను ప్రోత్స‌హిస్తామ‌ని ఆయన పేర్కొన్నారు. 

డిఫెన్స్ ఎక్స్పో 2022 నిర్వ‌హ‌ణ‌పై గుజ‌రాత్ ప్ర‌భుత్వం, ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ మ‌ధ్య గుజ‌రాత్‌లోని కేవ‌డియ వ‌ద్ద ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాధ్ స‌మ‌క్షంలో సంత‌కాలు జ‌రిగాయి. గుజరాత్‌లోని గాంధీన‌గ‌ర్‌లో వ‌చ్చే ఏడాది మార్చి 11-13 తేదీల్లో డిఫెన్స్ ఎక్స్పో జ‌ర‌గ‌నుంది.

గత ఏడాది డిఫెన్స ఎక్స్‌పోలో 70 దేశాలు పాల్గొన‌గా వ‌చ్చే ఏడాది ఈ ప్ర‌ద‌ర్శ‌న‌లో 100 వ‌ర‌కూ దేశాలు పాలుపంచుకుంటాయ‌ని ఆశిస్తున్నామ‌ని మంత్రి రాజ్‌నాధ్ సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. డిఫెన్స్ ఎక్స్‌పో2022 భార‌త్‌ను మిల‌ట‌రీ హార్డ్‌వేర్ త‌యారీ హ‌బ్‌గా ప్రపంచం ముందు ఆవిష్క‌రించేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టేలా ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ స‌న్నాహ‌లు చేస్తోంది.

కాగా, ప్రధానిగా మోదీ  2014 లో బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఎలాంటి భారీ ఉగ్రదాడి జరగలేదని, కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఉండడంపై ఉగ్రవాదులు భయపడుతున్నారని అంతకు ముందు బిజెపి సమావేశంలో ప్రసంగిస్తూ రక్షణ మంత్రి తెలిపారు. 

జవాన్లకు సంబంధించి గత 40 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న వన్ రాంక్ వన్ పెన్షన్ ( ఒఆర్‌ఒపి )పై కాంగ్రెస్ పార్టీ అంతగా పట్టించుకోక పోగా, మోడీ దాన్ని వెంటనే అమలు చేయగలిగారని కాంగ్రెస్ ప్రభుత్వానికి, బిజెపి ప్రభుత్వానికి గల తేడా ఇదేనని వ్యాఖ్యానించారు.

అయోధ్య రామాలయం గురించి ప్రస్తావిస్తూ అలాంటి అంశాలు కేవలం నినాదాలకు పరిమితం కారాదని, బాబ్రీ మసీదు కూల్చి వేత తరువాత తమ పార్టీ మూడు రాష్ట్రప్రభుత్వాలను త్యాగం చేయవలసి వచ్చిందని గుర్తు చేశారు.