సంగం డెయిరీ కేసులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు

సంగం డెయిరీ కేసులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురైంది. సంగం డెయిరీని స్వాధీనం చేసుకోవడానికి వీలులేదని హైకోర్టు స్పష్టం చేసింది. సింగిల్ బెంచ్ తీర్పుపై ప్రభుత్వం డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. అయితే డివిజన్ బెంచ్‌లో సైతం ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. సంగం డెయిరీని స్వాధీనం చేసుకునేందుకు జగన్ ప్రభుత్వం వేసిన రిట్ అప్పీల్‌ను డివిజన్ బెంచ్ కొట్టివేసింది.

దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు డివిజన్‌ బెంచ్‌.. సింగిల్‌ జడ్జి తీర్పును సమర్థిస్తూ ప్రభుత్వ రిట్‌ అప్పీల్‌ను తిరస్కరించింది. దీనికి సంబంధించి దాఖలయిన ఇంప్లీడ్‌ పిటిషన్లను కొట్టివేసింది. సంగం డెయిరీని స్వాధీనం చేసుకోకూడదు అని ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.

కాగా సంగం డెయిరీ కేసులో సంగం డెయిరీ ఛైర్మన్‌గా ఉన్న టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రపై గతంలో ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. మరోవైపు సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణన్‌ను కూడా ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. వాళ్లిద్దరికీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.

 అసైన్డ్ రైతుల విషయంలోనూ ఎదురుదెబ్బ 

రాజధాని అమరావతిలో అసైన్డ్ రైతుల విషయంలో కూడా ఏపీ ప్రభుత్వనాయికి ఎదురు దెబ్బ తగిలింది. విచారణ జరిపిన హైకోర్టు రాజధానిలో అసైన్డ్ రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లు వెనక్కి తీసుకుంటూ.. జారీ చేసిన జీవో-316పై తదనంతర చర్యలను  నిలిపివేసింది. 

అసైన్డ్ రైతులకు ఇచ్చిన ప్లాట్లను వెనక్కి తీసుకుంటూ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులను హైకోర్టులో రాజధాని రైతులు సవాల్ చేశారు. రాజధాని నిర్మాణం కోసం భూములు ఇస్తే.. గత ప్రభుత్వం వారికి ప్యాకేజీ ఇస్తూ.. జీవో-41ని తీసుకు వచ్చిందని కోర్టుకు రైతుల తరుఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. 

అయితే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు ప్రభుత్వ న్యాయవాది అభ్యంతరం తెలిపారు. జోవో-316పై తదనంతర చర్యలు నిలిపివేయాలని ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.