తెలంగాణలో పాఠశాలలు తెరవడంపై హైకోర్టు స్టే

తెలంగాణలో రేపటి నుంచే పాఠశాలలను పున:ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది. విద్యా సంస్థల్లో ప్రత్యక్ష బోధన వద్దని దాఖలైన పిటిషన్ ను విచారించిన ధర్మసనం ప్రత్యేక్ష తరగతుల విషయంలో విద్యార్థులపై ఒత్తిడి చేయవద్దని, అలాగే విద్యార్థుల తల్లిదండ్రులతో ఎలాంటి రాతపూర్వకంగా హామీలు తీసుకోరాదని కోర్టు స్పష్టం చేసింది. 
 
రేపటి నుంచి పాఠశాలలు పున:ప్రారంభిస్తున్న నేపథ్యంలో కరోనా వైరస్ తగ్గిందని చెప్పడానికి ప్రభుత్వం ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు చూపించలేదని పిటిషన్ దారుడు తన పిటిషన్ లో పేర్కొన్నారు. పాఠశాలల్లో చిన్న వయసు పిల్లలు ఉంటారని, వైరస్ వల్ల వారు ప్రమాదకర పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉంటుందని పిటిషనర్ ఆందోళన వ్యక్తం చేశారు. 
 
పాఠశాల సిబ్బంది, విద్యార్థులు అందరూ కలిపితే వందల మంది ఉంటారని, దీని వల్ల కరోనా వైరస్ కమ్యూనిటీ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉందని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్న తరుణంలో ఇప్పటికిప్పుడు ప్రత్యక్ష బోధన వద్దని కోర్టును కోరారు. ఈ వాదనలను విన్న ధర్మాసనం ప్రభుత్వ ఉత్తర్వులపై స్టే విధించింది.

అదేవిధంగా, ప్రత్యక్ష బోధనకు రావాలని విద్యార్థులను బలవంతం చేయొద్దని హైకోర్టు పేర్కొంది. ప్రత్యక్ష తరగతులకు హాజరుకాని విద్యార్థులపై చర్యలు తీసుకోవద్దని, అలాగే ప్రత్యక్ష తరగతులు నిర్వహించని విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవద్దంది. ఆన్‌లైన్ లేదా ప్రత్యక్ష బోధనపై విద్యా సంస్థలే నిర్ణయించుకోవచ్చునని తెలిపింది. 

ప్రత్యక్ష బోధన నిర్వహించే పాఠశాలలకు మార్గదర్శకాలు జారీ చేయాలని, వారంలోగా మార్గదర్శకాలు విడుదల చేయాలని విద్యాశాఖకు ఆదేశించింది. పాఠశాలలు పాటించాల్సిన మార్గదర్శకాలపై ప్రచారం చేయాలని హైకోర్టు ఆదేశించింది. గురుకులాలు, హాస్టళ్లలో ప్రత్యక్ష బోధనపై కూడా హైకోర్టు స్టే ఇచ్చింది. గురుకులాలు,  విద్యాసంస్థల్లో వసతిగృహాలు తెరవద్దని ఆదేశించింది. గురుకులాలు, హాస్టళ్లలో వసతులపై నివేదిక ఇవ్వాలంది. ప్రత్యక్ష బోధనపై పరస్పర విరుద్ధ లాభనష్టాలు ఉన్నాయని హైకోర్టు వ్యాఖ్యానించింది.

 రాష్ట్రంలో కొవిడ్ తీవ్రత ఇంకా కొనసాగుతోందని, సెప్టెంబరు, అక్టోబరులో మూడో దశ పొంచి ఉందని హెచ్చరికలు ఉన్నాయని, అలాగే విద్యాసంస్థలు తెరవకపోతే విద్యార్థులు నష్టపోతున్నారన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయంది. ప్రభుత్వం ఈ రెండింటిని సమన్వయం చేసి చూడాలని హైకోర్టు ఆదేశిస్తూ.. తదుపరి విచారణను అక్టోబరు 4వ తేదీకి వాయిదా వేసింది.

కాగా,  విద్యాసంస్థల్లో ప్రత్యక్ష బోధన సమయంలో కరోనా మహమ్మారి కారణంగా పాఠశాల విద్యార్థులకు ఏమైనా జరిగితే ఎవ్వరు బాధ్యులని  హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. చాలామంది స్కూల్లో ఇచ్చే న్యూట్రిషన్ ఫుడ్ మిస్ అవుతున్నారని ఏజీ కోర్టుకు తెలిపారు. స్కూల్లో ఆహార సరఫరాపై డీఈఓ నేతృత్వంలో పర్యవేక్షణ చేస్తామని ఏజీ తెలిపారు.

సెప్టెంబర్ – అక్టోబర్‌లో కోవిడ్ తీవ్రస్థాయిలో విజృంభిస్తుందని నివేదిక అందించిన డబ్ల్యూహెచ్ఓకు ఏం చెబుతారని హైకోర్టు ప్రశ్నించింది. కొవిడ్ టీకా పూర్తి కాలేదని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అలాంటప్పుడు ఏవిధంగా వ్యాక్సిన్ లేకుండా పాఠశాలలకు ప్రవేశాన్ని అనుమతిస్తున్నారని ప్రభుత్వాన్ని నిలదీసింది.

ఒకవేళ స్కూల్స్‌లో ఉన్న పిల్లలకు ఏమైనా జరిగితే దానికి ఎవరు బాధ్యులు? ఒకవేళ స్కూల్ తెరవకపోతే మేనేజ్‌మెంట్ మీద మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారు? పిల్లలను స్కూల్స్‌కు పంపకపోతే కూడా తల్లిదండ్రుల పైన ఏమైనా చర్యలు తీసుకునే అధికారం మీకు ఉందా? అని అడిగింది. ?మీరు ఇచ్చిన జీవోలో మేనేజ్‌మెంట్ మీదగాని, పిల్లల తల్లిదండ్రుల మీద గానీ ఎటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పలేదు. ప్రభుత్వము ఫిజికల్‌గా, వర్చువల్‌గా క్లాసు నిర్వహిస్తుందా?’’ అంటూ హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది.