ఆకర్శణీయ తయారీ కేంద్రంగా అమెరికాను అధిగమించిన భారత్ 

ప్రపంచంలోనే రెండో అత్యంత ఆకర్శణీయమైన తయారీ కేంద్రంగా నిలిచిన భారత్ అమెరికాను అధిగమించింది. పని వాతావరణం, వ్యయ పోటీతత్వం కారణంగా భారతదేశం ఈ స్థానాన్ని సాధించింది. ఇదేకాకుండా, భారతదేశం ఔట్‌సోర్సింగ్ అవసరాలను కూడా నెరవేర్చింది. ఈ విభాగంలో కూడా ర్యాంకింగ్ మెరుగుపడింది.

రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్స్ కుష్మన్ & వేక్‌ఫీల్డ్ విడుదల చేసిన గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ రిస్క్ ఇండెక్స్-2021 ప్రకారం, ప్రపంచంలోనే అత్యంత ఆకర్షణీయమైన తయారీ కేంద్రంగా చైనా ఉన్నది. ఒక స్థానం ఎగబాకి, రెండో స్థానానని భారతదేశం హస్తగతం చేసుకున్నది. గత ఏడాది నివేదికలో అమెరికా రెండవ స్థానంలో, భారతదేశం మూడవ స్థానంలో ఉన్నాయి.

ఐరోపా, అమెరికా, ఆసియా-పసిఫిక్‌లోని 47 దేశాల్లో తయారీకి ఆకర్షణీయమైన ప్రదేశాలను గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్‌ రిస్క్‌ ఇండెక్స్‌ అంచనా వేస్తుంది. ఈ నివేదిక ప్రకారం, అమెరికాకు మూడవ స్థానం, కెనడా నాల్గవ, చెక్ రిపబ్లిక్ ఐదవ, ఇండోనేషియా ఆరవ, లిథువేనియా ఏడవ, థాయ్‌ల్యాండ్ ఎనిమిదవ, మలేషియా తొమ్మిదవ, పోలాండ్ పదవ స్థానంలో ఉన్నాయి. 

అమెరికా, ఆసియా-పసిఫిక్ ప్రాంతాలతో పోలిస్తే చాలా మంది తయారీదారులు భారతదేశంలో తమ కంపెనీలను ప్రారంభించేందుకు ఆసక్తి చూపుతున్నారు. భారతదేశంలో తయారీ రంగంలో మొత్తం కంపెనీల్లో తయారీ కంపెనీల వాటా 20 శాతంగా ఉన్నది. అయితే, జూలై నెలలో వీరి వాటా 21 శాతానికి పెరిగింది. గత నెలలో దేశంలో మొత్తం 15,499 కంపెనీలు నమోదయ్యాయి. వీటిలో 21 శాతం అంటే 3,217 కంపెనీలు తయారీకి సంబంధించినవే ఉన్నాయి.