శ్రీనగర్ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు కమాండర్లు హతం

శ్రీనగర్‌లోని అలుచి బాగ్ ప్రాంతంలో సోమవారం సాయంత్రం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు లస్కరే తోయిబా ఉగ్రవాదులను జమ్ముకశ్మీర్ పోలీసులు హతమార్చారు. చనిపోయిన ఇద్దరు ఉగ్రవాదులు లష్కరే తోయిబాలో కమాండర్‌ స్థాయిలో విధులు నిర్వహించే అబ్బాస్‌ షేక్‌, షకీబ్‌ మన్సూర్‌లుగా గుర్తించినట్లు కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ తెలిపారు. 

ఇటీవల పోలీసులు విడుదల చేసిన మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్ట్‌ల జాబితాలో చనిపోయిన ఈ ఇద్దరి పేర్లు ఉన్నట్లు సమాచారం.  కశ్మీర్ జోన్ పోలీసుల సమాచారం ప్రకారం.. అలుచి బాగ్‌ ప్రాంతంలోని ఓ ఇంట్లో ఉగ్రవాదులు దాగి ఉన్నట్టు సమాచారం అందడంతో పోలీసులు సెర్చ్‌ ఆపరేషన్‌ ప్రారంభించారు.

ఈ క్రమంలో పోలీసులపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు పారిపోయేందుకు ప్రయత్నించారు. ఇరు వర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. వారిద్దరూ నగరంలో జరిగిన పలు ఉగ్రవాద కార్యకలాపాలకు బాధ్యులని, అనేక హత్యలకు పాల్పడ్డారని, యువతను ఉగ్రవాదులుగా చేర్చుకొని ప్రయత్నం చేస్తున్నారని కూడా చెప్పారు.

అబ్బాస్ షేక్  సుదీర్ఘకాలం పాటు జీవించి ఉన్న మిలిటెంట్లలో ఒకరు. పైగా రెసిస్టెన్స్ ఫ్రంట్ (టి ఆర్ఎఫ్) అధిపతి. సకీబ్ మంజూర్ అతని సహాయకుడు. గతంలో హిజ్బుల్ ముజాహిదీన్‌లో ఉన్న అబ్బాస్ షేక్ రెండు సంవత్సరాల క్రితం టిఆర్ఎఫ్ కు  ఫిరాయించాడు. పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థి అయిన మంజూర్ వేగంగా పలు హత్యలు చేయగలగడంతో త్వరగా పైకి ఎదిగాడు.  షేక్ ఆదేశాల మేరకు శ్రీనగర్ పరిసరాలలో ఉగ్రవాద కార్యకలాపాలు చేపడుతున్నాడు.

మరోవంక, బారాముల్లా జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య మంగళవారం తెల్లవారు జామున ఎన్‌కౌంటర్‌ ప్రారంభమైంది. సోమవారం అర్ధరాత్రి సోపోర్‌ ప్రాంతంలోని పెత్‌సీర్‌లో ఉగ్రవాదులు ఉన్నట్లు పక్కా సమాచారం అందింది. దీంతో బలగాలు కార్డన్‌ సెర్చ్‌ ఆపరేషన్‌ ప్రారంభించాయని కశ్మీర్‌ జోన్‌ పోలీసులు తెలిపారు.

మంగళవారం తెల్లవారు జామున బలగాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు పేర్కొన్నారు. ఇరువైపులా ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదని పేర్కొన్నారు. ఉగ్రవాదులు తప్పించుకోకుండా గ్రామం నలువైపులా దిగ్బంధించి, విద్యుత్‌ దీపాలు ఏర్పాటు చేశారు.  గ్రామంలో నక్కిన వారిని పట్టుకునేందు బలగాలు ప్రయత్నిస్తున్నాయి.  అవంతిపోరాలోని నాగబెరన్ ట్రాల్ అటవీ ప్రాంతంలో జైషే మహ్మద్‌కు అనుబంధంగా పని చేస్తున్న ముగ్గురు గుర్తు తెలియని ఉగ్రవాదులను సైతం శనివారం సైన్యం మట్టుబెట్టింది.