ఆక్రమిత కాశ్మీర్ లో ఉగ్రవాదుల ర్యాలీ

మరోసారి ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ తీరు బయటపడింది. ఉగ్రవాదులకు ఎలాంటి మద్దతు ఇవ్వడంలేదని ఇన్నాళ్లూ చెప్తూ వచ్చిన పాకిస్తాన్‌.. పాక్ ఆక్రమిత కశ్మీర్‌ (పీఓకే)లో తాలిబాన్‌కు మద్దతుగా జైష్, లష్కర్ ఉగ్రవాదులు ర్యాలీలు చేపట్టడంతో పాక్‌ తీరు తేటతెల్లమైంది. 

తాలిబాన్‌కు మద్దతుగా నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టిన ఉగ్రవాదులు, గాలిలోకి బుల్లెట్లు కాల్చి తమ సంతోషాన్ని వెల్లగక్కారు. ఉగ్రవాద గ్రూపులకు మద్దతు ఇవ్వడం లేదన్న పాకిస్తాన్ అబద్ధం ఇలా మరోసారి బహిర్గతమైంది.

పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) లో తాలిబాన్‌కు మద్దతుగా జైష్-ఇ-మొహమ్మద్ (జేఎం), లష్కరే తోయిబా (ఎల్ఈటీ) ఉగ్రవాదులు ర్యాలీ చేపట్టారు. ఈ రెండు సంస్థల ఉగ్రవాదులు గాలిలోకి కాల్పులు జరిపి ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబాన్‌ స్వాధీనం చేసుకోవడం పట్ల తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. 

ఇదే సమయంలో నిర్వహించిన బహిరంగ సమావేశంలో పలువురు నాయకులు రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినట్లు తెలుస్తున్నది. ఈ ర్యాలీలు అబ్బాస్‌పూర్, హజీరా, సెన్సా ప్రాంతాలలో నిర్వహించినట్లు సమాచారం. ఈ ప్రాంతాలు నియంత్రణ రేఖకు సమీపంలోనే ఉన్నాయి.

ఇక్కడ, కొంతమంది పాకిస్తానీ జర్నలిస్టులు తాలిబాన్ నాయకుడు ముల్లా బరదర్, ఐఎస్‌ఐ చీఫ్ ఫైజ్ హమీద్ కలిసి ప్రార్థనలు చేస్తున్న ఫొటోలను కూడా సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసారు. ఇది ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించేదిగా తయారైంది.