ప్ర‌స్తుత ఆఫ్ఘ‌న్ దుస్థితికి పాకిస్థాన్ కారణం

ప్ర‌స్తుత ఆఫ్ఘ‌న్ దుస్థితికి పాకిస్థాన్ కార‌ణ‌మ‌ని  ఆఫ్ఘ‌నిస్తాన్‌కు చెందిన పాప్ స్టార్ అర్యానా స‌యీద్ ఆరోపించారు. తాలిబ‌న్ల‌కు పాకిస్థాన్ అండ‌గా నిలుస్తోంద‌ని, దానికి సంబంధించిన వీడియోలు, ఆధారాలు చాలా ఉన్న‌ట్లు అర్యానా తెలిపారు. ఎవ‌రైనా ఒక తాలిబ్‌ను ప‌ట్టుకుంటే, అత‌ని ఐడెంటిటీ పాకిస్థాన్‌కు చెంది ఉన్న‌ట్లు తెలుస్తోంద‌ని ఆమె స్పష్టం చేశారు.

 తాలిబ‌న్ల బెదిరింపుల నేప‌థ్యంలో దేశం విడిచి ఖ‌తార్‌లోని దోహాకు చేరుకున్నాన‌ని, అక్క‌డ నుంచి ఇస్తాంబుల్‌కు వెళ్ల‌నున్న‌ట్లు ఆమె చెప్పారు. ఆఫ్ఘ‌న్‌ను విడిచి వ‌చ్చినందుకు సంతోషంగా ఉంద‌ని, కానీ అక్క‌డ ఉన్న మ‌హిళ‌ల ప‌రిస్థితి దారుణంగా ఉన్న‌ట్లు పాప్ స్టార్ తెలిపారు. 

20 ఏళ్ల క్రితం ఎదురైన అనుభ‌వాలు బాధాక‌ర‌మ‌ని, అలాంటి ప‌రిస్థితులే మ‌ళ్లీ ఉత్ప‌న్నం అవుతున్నాయ‌ని ఆమె పేర్కొన్నారు. మ‌హిళ‌లు ఇండ్ల‌కే ప‌రిమితం అవుతార‌ని, వాళ్ల ప్రాథ‌మిక హ‌క్కుల్ని కాల‌రాస్తున్నార‌ని ఆమె చెప్పారు. స్కూల్‌కు కూడా వెళ్ల‌లేని ప‌రిస్థితి ఉంటుంద‌ని ఆందోళన వ్యక్తం చేశారు. 

ఆఫ్ఘ‌నిస్తాన్‌ను తాలిబ‌న్ల చేతుల్లోకి వ‌దిలేస్తే, అప్పుడు ఆఫ్ఘ‌న్ మ‌హిళ‌ల‌కు భ‌విష్య‌త్తు ఉండ‌ద‌ని ఆమె స్పష్టం చేశారు. కేవ‌లం కొన్ని రోజుల్లోనే యావ‌త్ ఆఫ్ఘ‌న్‌ను తాలిబ‌న్లు వ‌శం చేసుకోవ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింద‌ని ఆమె విస్మయం వ్యక్తం చేశారు.

ఆల్‌ఖ‌యిదా, తాలిబ‌న్ల‌ను అంతం చేస్తామ‌ని అగ్ర‌దేశాలు 20 ఏళ్ల క్రితం ఆఫ్గ‌న్ వ‌చ్చాయ‌ని, కానీ ఇప్పుడు త‌మ దేశాన్ని వ‌దిలి వెళ్ల‌డం బాధ క‌లిగిస్తోంద‌ని ఆమె పేర్కొన్నారు. అంత‌ర్జాతీయ దేశాలు ఆఫ్ఘ‌న్‌లో శాంత స్థాప‌న కోసం ప్ర‌య‌త్నాలు చేయాల‌ని ఆమె కోరారు. ఆఫ్ఘ‌న్ రాజ‌కీయాల్లో పాక్ జోక్యం చేసుకోకూడ‌ద‌ని ఆమె స్పష్టం చేశారు. భార‌త్ ఎప్పుడూ మాతో స‌ఖ్యంగా ఉంద‌ని, వాళ్లు నిజ‌మైన స్నేహితుల‌ని ఆమె కొనియాడారు. శ‌ర‌ణార్థుల ప‌ట్ల  భారత్ దయతో ఉన్నదని ఆమె చెప్పారు.

ఈ 36-ఏళ్ళ మహిళా గతంలో ఆఫ్ఘన్ సైనికులకు బహిరంగంగా మద్దతు తెలిపింది. ఆఫ్ఘన్ నుండి అమెరికా తన సైనికులను వెనుకకు తీసుకెళ్లడం పట్ల విచారం వ్యక్తం చేస్తూ ఆఫ్ఘన్ నుండి వలస వస్తున్న కొద్దిమందికి ఆశ్రయం కల్పించడం ముదావాహమే అయినప్పటికీ, దేశంలో అరాచకంలో వదిలివేయబడిన లక్షలాదిమంది ప్రజల సంగతి ఏమిటని ఆమె ఆందోళన వ్యక్తం చేసింది.