రైలు ఆలస్యం కావడంతో రూ 4.5 లక్షల పరిహారం

మన రైళ్ల రాకపోకలు ఆలస్యంగా జరుగుతూ ఉండడం సర్వాధారణం. ఎప్పుడు ఏ రైలు ఎక్క‌డ ఆగుతుందో.. ఎప్పుడు వ‌స్తుందో తెలియ‌న పరిస్థితి తరచూ నెలకొంటుంటుంది. అయితే ఇలా రైలు ఆల‌స్య‌మైన ప్ర‌తిసారీ ప‌రిహారం అందించ‌డం ఎప్పుడైనా విన్నారా? 
 
కానీ భారత్ లో తొలి ప్రైవేటు రైలు తేజ‌స్ ఎక్స్‌ప్రెస్ రెండున్న‌ర గంట‌లు ఆల‌స్యమైనందుకు అందులోని మొత్తం 2035 మంది ప్ర‌యాణికుల‌కు ఐఆర్‌సీటీసీ రూ.4.5 లక్ష‌ల ప‌రిహారం చెల్లించ‌నుంది. శ‌ని, ఆదివారాల్లో మూడు ట్రిప్పులు క‌లిపి ఈ రైలు రెండున్న‌ర గంట‌లు ఆల‌స్య‌మైంది. శ‌నివారం భారీ వ‌ర్షాల కార‌ణంగా ఢిల్లీ రైల్వే స్టేష‌న్‌లో సిగ్న‌ల్ ఫెయిల‌వ‌డంతో ఈ తేజ‌స్ ఎక్స్‌ప్రెస్ ఆల‌స్య‌మైంది. ఆదివారం కూడా ల‌క్నో నుంచి ఢిల్లీ వెళ్లే ఈ రైలు గంట ఆల‌స్యంగా న‌డిచింది.
భారత్ లో తొలిసారిగా ఓ రైలు ఆల‌స్య‌మైతే ప‌రిహారం చెల్లించే నిబంధ‌న తేజ‌స్ ఎక్స్‌ప్రెస్ విష‌యంలో ఉంది. రైలు గంట ఆల‌స్య‌మైతే రూ.100, రెండు గంట‌లు, అంత‌కంటే ఎక్కువైతే రూ.250 ప‌రిహారం ఒక్కో ప్ర‌యాణికుడికి ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు శ‌నివారం తేజ‌స్ ఎక్స్‌ప్రెస్ ఆల‌స్య‌మైనందుకు అందులోని 1574 మంది ప్ర‌యాణికుల‌కు ఒక్కొక్క‌రికి రూ.250 చొప్పున మొత్తం రూ.3.93 ల‌క్ష‌లు చెల్లించనుంది.
అదేవిధంగా,  ఆదివారం ఆల‌స్య‌మైనందుకు అందులోని 561 మంది ప్ర‌యాణికులు ఒక్కొక్క‌రికి రూ.150 చొప్పున ఈ రైలును ఆప‌రేట్ చేస్తున్న ఐఆర్‌సీటీసీ చెల్లిస్తుంది. విమానంలాంటి వ‌స‌తుల‌తో తొలి తేజ‌స్ ఎక్స్‌ప్రెస్ 2019, ఆగ‌స్ట్ 4న ల‌క్నో నుంచి ఢిల్లీ వెళ్లింది.
ఈ రెండేళ్ల కాలంలో గంటలోపు రైలు ఆల‌స్య‌మైన సంద‌ర్భాలు ఐదుసార్లు మాత్ర‌మే ఉన్నాయి. 99.9 శాతం ఈ రైలు ఆల‌స్యం కాద‌ని ఐఆర్‌సీటీసీ చెబుతోంది. గ‌త రెండేళ్ల‌లో ఐఆర్‌సీటీసీ ఇంత భారీ మొత్తంలో ప‌రిహారం చెల్లించాల్సి రావ‌డం ఇదే తొలిసారి. గ‌త శీతాకాలంలోనూ ఇలాగే రైలు రెండు గంట‌ల ఆల‌స్యం కాగా,  అందులోని 1500 మంది ప్ర‌యాణికుల‌కు ప‌రిహారం చెల్లించారు.