మతం మారకుంటే హింసించి చంపుతున్న తాలిబన్లు

అఫ్గాన్‌ను తమ గుప్పెట్లోకి తెచ్చుకున్న తాలిబన్ల అరాచకాలకు అడ్డు అదుపూ లేకుండా పోతోందని అమెరికా కాంగ్రెస్ మాజీ సభ్యుడు మార్క్ వాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ దేశంలో పరిస్థితి చాలా ఘోరంగా ఉందని ఆయన అన్నారు. మానవ హక్కులను కాలరాస్తూ తాలిబన్లు దమనకాండకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. 

మైనారిటీలపై దాడులు చేస్తూ, మతం మారకుంటే క్రూరంగా హింసించి చంపుతున్నారని చెప్పారు. అమెరికాలోని ఓ రేడియో సంస్థకు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో తాలిబన్ అరాచకాలకు సంబంధించి తనకు కొన్ని సంఘటనలు తెలుస్తున్నాయంటూ దిగ్భ్రాంతి కలిగించే విషయాలు చెప్పారు. ఒక క్రిస్టియన్ అఫ్గానీని అత్యంత క్రూరంగా చంపిన ఘటన తన దృష్టికి వచ్చిందని మార్క్ వాకర్ చెప్పారు.

‘‘అఫ్గాన్‌కు చెందిన ఒక క్రిస్టియన్ కుటుంభంపై తాలిబన్లు దాడి చేశారు. మతం మారాలని అడిగారు. ఆ పనికి వాళ్లు ఒప్పుకోకపోవడంతో ఇంటి పెద్దను దారుణంగా కొట్టి హింసించారు. బతికుండగానే ఆయన చర్మం వలిచి, ఆ తర్వాత ఒక స్తంభానికి ఉరి తీసి చంపారు” అని మార్క్ రేడియో ఇంటర్వ్యూలో చెప్పారు. 

ప్రస్తుతం అక్కడి వాళ్లు భయంతో వణికిపోతూ బతుకుతున్నారన్న మాట కూడా చాలా చిన్నదే అవుతుందని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ విషయాలు ఎలా తెలిశాయని ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి ప్రశ్నించగా తన సోర్స్‌ను బయటపెట్టలేనని స్పష్టం చేశారు.

అమెరికా డిఫెన్స్ విభాగంతో పాటు అఫ్గాన్‌లో గడిచిన కొన్నేండ్లుగా ఉన్న అనేక మంది తనతో టచ్‌లో ఉన్నారని, ఆ వ్యక్తుల పేర్లు బయటకు చెప్పలేనని మార్క్ తెలిపారు. తన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం తాలిబన్లు ఇంటింటికీ తిరిగి తమకు అనుకూలంగా ఎవరున్నారు? వ్యతిరేకిస్తున్న వాళ్లెవరు? లాంటి విషయాలను తెలుసుకుంటూ అరాచకాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. 

తాలిబన్లకు వ్యతిరేకంగా అక్కడ జరుగుతున్న వాస్తవాలను బయటపెట్టే ప్రయత్నం చేస్తున్న కొంత మంది పాశ్చాత్త మీడియా రిపోర్టర్లపైనా దాడులు జరుగుతున్నాయని చెప్పారు.