కాబూల్ పరిసరాల్లో భారతీయులు క్షేమం

ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ పరిసరాల్లో భారతీయులు క్షేమంగా ఉన్నారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. 150 మందికిపైగా తాలిబన్ల నిర్బంధంలో ఉన్నారని, వీరిలో అత్యధికులు భారతీయులేనని వార్తలు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వ వర్గాలు స్పందించినట్లు తెలిపింది. అధికారులు అక్కడి భారతీయులతో నిరంతరం మాట్లాడుతున్నారని పేర్కొంది.

కాబూల్‌లోని భారతీయులకు మధ్యాహ్న భోజనం అందజేశారని, వారు విమానాశ్రయానికి బయల్దేరారని చెప్పినట్లు తెలిపింది. వీరిని స్వదేశానికి తరలించేందుకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదిలావుండగా, తాలిబన్ అధికార ప్రతినిధి అహ్మదుల్లా వసీక్ స్థానిక మీడియాతో మాట్లాడుతూ, సుమారు 150 మంది భారతీయులను తాము నిర్బంధినట్లు వస్తున్న వార్తలు నిజం కాదని కొట్టిపారవేశారు.

వీరంతా హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం పరిసరాల్లో ఉన్నట్లు తెలిపారు. వారిని సురక్షితంగా విమానాశ్రయానికి చేర్చినట్లు తెలిపారు. కాబూల్ విమానాశ్రయం వద్ద దాదాపు 100 నుంచి 150 మంది భారతీయులను తాలిబన్లు నిర్బంధించారని కొందరు ఆఫ్ఘన్ పాత్రికేయులు చెప్పినట్లు సామాజిక మాధ్యమాల్లో  వార్తలు వెలువడిన కొద్ది క్షణాల్లో కాబూల్‌లోని పాత్రికేయులు స్పందిస్తూ, భారతీయులంతా క్షేమంగా ఉన్నారని, వారిని తనిఖీ చేసేందుకు తాలిబన్లు తీసుకెళ్లారని పేర్కొన్నారు. 

అయితే,  కాబూల్ ఎయిర్‌పోర్టు వద్దు విమానాల కోసం వేచి చూస్తున్న వీరిని తాలిబన్లు నేడు ఉదయం అదుపులోకి తీసుకున్నారని చెబుతున్నారు. అనంతరం..వారిని సమీప పోలీస్ స్టేషన్‌కు తరలించి అక్కడ పలు ప్రశ్నలు అడిగారట. వారి వద్ద ఉన్న డాక్యుమెంట్లను పరిశీలించిన తరువాత మళ్లీ వారిని ఎయిర్ పోర్టు వద్ద దిగబెట్టినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. 

ఇలా ఉండగా,  కాబూల్ నుంచి భారత వాయుసేన సి-130 జే విమానం 85 మంది భారతీయులతో శనివారం బయలుదేరింది. అఫ్ఘానిస్థాన్ దేశాన్ని తాలిబన్లు స్వాధీనం చేసుకోవడంతో కాబూల్ నగరంలో ఉన్న 85 మంది భారత పౌరులను అధికారులు వాయుసేన విమానంలో తీసుకువస్తున్నారు. కాబూల్ నుంచి బయలుదేరిన ఈ విమానం ఇంధనం నింపుకోవడానికి తజికిస్థాన్‌లో ల్యాండ్ అయింది. 

కందహార్ నుంచి భారతపౌరులను తిరిగి తీసుకువచ్చారు. కందహార్ నుంచి భారత రాయబార కార్యాలయ సిబ్బంది కాబూల్ వచ్చి అక్కడి వారిని స్వదేశానికి తీసుకువస్తున్నారు. తాలిబాన్ల క్రూరమైన పాలన, ప్రతీకార హత్యల ముప్పు గురించి ప్రజలు భయపడుతున్నందున అఫ్ఘాన్ రాజధానిలో ప్రజలకు భయం పట్టుకుంది. భారత పౌరులను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడంలో భారత అధికారులు సహాయం చేశారు.

ఆఫ్ఘ‌న్‌లో సిక్కులు క్షేమంగానే ఉన్నార‌ని ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్‌మెంట్ క‌మిటీ అధ్య‌క్షుడు మంజింద‌ర్ సింగ్ సిర్సా స్ప‌ష్టంచేశారు.ఆఫ్ఘ‌నిస్థాన్‌లోని గురుద్వారా ప‌రిస‌రాల్లో దాదాపు 300 మంది సిక్కులు త‌ల‌దాచుకున్నారు.